Monday, December 24, 2007

నిస్సంస్కృతీకరణ (de-sanskritization)

నిన్న రాత్రి చంద్ర కన్నెగంటిగారితో మాట్లాడుతున్న సందర్భంలో వచ్చిన ఒక ప్రస్తావన, ఈ రోజు ఆంధ్రజ్యోతిలో చూసిన ఒక వార్త ఈ పోస్ట్ రాయడానికి పురిగొల్పాయి.

ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త ఎం.ఎన్.శ్రీనివాసన్ సంస్కృతీకరణ (sanskritization) అనే పదాన్ని బాగా వ్యాప్తిలోకి తెచ్చారు.(Ref: Caste in Modern India and other Essays by M.N.Srinivasn). భారతదేశ కులవ్యవస్థని విశ్లేషిస్తూ ఆయన చాలా రచనలు చేశారు.

కులవ్యవస్థలో కింది మెట్ల మీద ఉన్న కులాలు తమ కులానికి "గౌరవం","ప్రామాణికత" ఆపాదించుకోడం కోసం కొన్ని బ్రాహ్మణ ఆచారాలు, కట్టుబాట్లు,పధ్ధతులు,పూజా విధానాలు పాటిస్తారని,ఆ విధంగా చేయడంవల్ల కులాలనిచ్చెనలో ఇంకో మెట్టు పైకి ఎదిగే అవకాశం ఉందనీ ఆయన అంటారు. శాకాహారం తినడం,పూజల్లో మాంసం నిషిధ్ధం చేయడం, బ్రాహ్మణ పూజార్లతో పూజలు చేయించడం(గ్రామదేవతల జాతర్లలో కూడా),పండగదినాల్లో మాంసం తినకపోడం (కొన్ని మినహాయింపులతో)..ఇవన్నీ కొన్ని ఉదాహరణలు. ఇంకా మంగలి కులం తమని "నాయీ బ్రాహ్మణులు" గా, కంసాలివాండ్రు తమని "విశ్వబ్రాహ్మణులు" గా సంభోధించుకోడం,జంధ్యం ధరించడం, చాకలి, మంగలి వంటి పురాతన తెలుగు పదాలకన్నా క్షురకుడు, రజకుడు వంటి సంస్కృత పదాలు గౌరవప్రదంగా భావించడం వంటివి మరికొన్ని ఉదాహరణలు. స్థూలంగా సంస్కృతీకరణ అర్ధం ఇది.తర్వాత రోజుల్లొ ఈ పదం పరిధి చాలా విశాలంగా,కులవ్యవస్థ చారిత్రక పరిణామక్రమం మదింపుకి కూడా అన్వయించబడిందనుకోండి.అలాగే ఈ భావన తాలూకు పరిమితుల గురించి కూడా చాలా పరిశోధన జరిగింది.జరుగుతూనే ఉంది.

ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే, 1962లో శ్రీనివాసన్ చూసిన, విశ్లేషించిన కులవ్యవస్థకి,45 సంవత్సరాల పరిణామక్రమంలో ఇప్పుడు వచ్చిన మార్పుకి ఉన్న తేడాని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ కులవ్యవస్థ దృష్ట్యా చూసినట్లయితే గత 15 సంవత్సరాల్లో ఇదే సంస్కృతీకరణ వ్యతిరేకదిశలో జరుగుతున్నట్లుగా కనబడ్తున్నది.అంటే కులాలనిచ్చెన మీద పై మెట్టులో ఉన్న కులాలు ఒక మెట్టు దిగి తమని "నిమ్నకులాలు" గా ప్రకటించమని ప్రభుత్వాల్ని కోరడం కనబడ్తున్నది. కాపులని బి.సి.కులాల జాబితాలో చేర్చమని విజ్ఞప్తి చేయడం,ప్రభుత్వం దాని అధ్యయానికి ఒక కమిషన్ నియమించడం ఒక ఉదాహరణ. రజకుల్ని ఎస్.సి జాబితాలో చేర్చమని విజ్ఞప్తి చేయడం ఇంకో ఉదాహరణ.

అయితే ఇక్కడొక చిన్న తిరకాసు ఉంది. కేవలం రిజర్వేషన్ వ్యవస్థ వల్ల వచ్చే లాభాలని పొందడానికి మాత్రమే ఈ కోరిక కోరుతున్నారా లేక నిజంగా సామాజిక హోదా పరంగా కూడా ఏ కులమయినా ఈ రోజు తమని తాము "నిమ్నకులం"గా భావిస్తున్నారా అనేది పెద్ద ప్రశ్న.

ఇక్కడ ఇంకో వైరుధ్యం కూడా ఉంది.నిమ్నకులస్తులు ఆర్ధిక అసమానతల వల్ల కోల్పోయే అవకాశాల్ని రిజర్వేషన్లద్వారా వారికి తిరిగి కల్పించి,సామాజికంగా వారి హోదాని,స్థాయిని పెంచడం రిజర్వేషన్ వ్యవస్థ పుట్టడానికి మూలకారణం. కానీ ఇప్పటికే సామాజికంగా కొంత మెరుగయిన స్థాయిలో ఉన్న కులాలు ఆర్ధికపరమయిన అవకాశాల్ని రిజర్వేషన్ల ద్వారా అందిపుచ్చుకోవాలనుకోడం కోసం ఒక మెట్టు దిగి తమని "నిమ్నకులాలు" గా ప్రకటించాలని కోరడం మన వ్యవస్థలో వచ్చిన ఒక వైచిత్రి.

అనుకున్న విధంగా కాకపోయినా,రిజర్వేషన్లు సామాజిక అంతరాల్ని ఇంకో విధంగా తొలగిస్తున్నట్లు కనబడ్తున్నది ! ఈ కోరికల వెనుక ఓటుబాంకు రాజకీయాలు ఉన్నాయనేది వేరే పార్శ్వం. కానీ ఈ పరిణామాలన్నీ నాకు మాత్రం నిస్సంస్కృతీకరణ (de-sanskritization) లాగా కూడా కనబడ్తున్నాయి. ఈ పదం ఉందో లేదో నాకు తెలియదు. శ్రీనివాసన్ బహుశా ఇదే పదం వాడి ఉండేవారేమో !

కవులు కూడా కడపకేనా ?

కొద్దివారాలుగా చిన్న వివాదం నడుస్తున్నది.బమ్మెర పోతన తెలంగాణాలోని వరంగల్(ఏకశిలానగరం)కి చెందినవాడా, లెకుంటే కడప జిల్లాలోని ఒంటిమిట్టకి చెందినవాడా అని.
ఈ వివాదం ఇప్పటిది కాదు(ట).వందేళ్ళ క్రితమే మొదలయి,చల్లబడి,ప్రస్తుతం జరుగుతున్న కడప ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా తిరిగి రేగింది.

మంత్రి గల్లా అరుణకుమారి, కడప కలెక్టరు మీడియా ముఖంగా పోతన కడపజిల్లావాడే అని చెప్పినారుట.ఇహ ఇరువేపులా వాదప్రతివాదాలు మొదలయినాయి. తెలంగాణ రచయితల తరపున మొన్నీమధ్యే ఒక పత్రికాప్రకటన వెలువడింది.పోతన తెలంగాణావాడే అని.కాదు కాదంటూ అటువేపు నుండి నిరూపణలూ, సాక్ష్యాధార సమర్పణలూ పత్రికాముఖంగా జరుగుతున్నాయి.ఆసక్తి ఉన్నవాళ్ళు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వ్యాసాలు చూడండి.

ఈ పోస్ట్ కి లేబుల్ తగిలించేప్పుడు ఇది సాహిత్యమా..రాజకీయమా అనే మీమాంస వచ్చింది నాకు. ఇంకో కొత్త లేబుల్ పెట్టాలేమో. "రాజకీయసాహిత్యం" లేదా "సాహిత్యరాజకీయం" అని !
ప్రస్తుతానికి ఇది "కాలక్షేపం" గుంపుకి వెళ్తుంది అనుకుంటా !

ఐదవ తెలుగువెన్నెల విశేషాలు !


16వ తేదీన రైస్ వన్ రోల్ రెస్టారెంట్లో జరిగిన ఐదవ తెలుగువెన్నెల ఈసారి ఎక్కువమంది సాహితీ ప్రియుల్ని ఆకర్షించింది. కాలం గడిచేకొద్దీ సమావేశాలకి హాజరవుతున్న సాహితీ ప్రియుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.ముదావహం.


చంద్ర కన్నెగంటిగారు తెలుగు కథా సాహిత్యం మీద మాట్లాడ్డం ఈసారి ప్రత్యేకత. ఇంతకు మునుపు పద్యకవిత్వం ప్రధానంగా జరిగిన సమావేశాలు ఈసారి చంద్రగారి వల్ల ఆధునిక సాహిత్య ప్రక్రియ అయిన కథవేపు దృష్టి మరల్చాయి. పూర్తి ప్రసంగంలా కాకుండా కొంత చర్చాగోష్టిలా సాగడం కూడా ఈసారి కనబడింది. బహుశా చంద్ర "మనవూరివాడు" అవడం వల్ల,వేదిక సభ్యులకీ,వక్తకీ గతంలోకన్నా కొంత సామీప్యత "క్రియేట్" అయినట్లుగా నాకు అనిపించింది.మున్ముందు కూడా ఇదే స్ఫూర్తితో సమావేశాలు జరిగితే బాగుంటుందెమో.


ఇంకో విశేషం ఎక్కువమంది మహిళలు హాజరవ్వడం.క్రమం తప్పకుండా వచ్చే చిలుకూరి అన్నపూర్ణగారితో పాటు మంజులత కన్నెగంటి,డా శ్రీ దేవి,సుభాషిణి,వీణ,అన్నపూర్ణ నెహ్రూ..ఇలా చాలామంది మహిళా సాహితీప్రియులు రావడం నిజంగా సంతోషదాయకం.


రెండు నెలల గైర్హాజరీ తర్వాత ఆళ్ళ శ్రీనివాసుడు, పులిగండ్లవారూ కనిపించారు.సంతోషం !
భాస్కర్,మంజులత కన్నెగంటి గార్ల కవితా పఠనం, జువ్వాది రమణ గారి (సిరివెన్నెల సీతారామశాస్త్రి) గేయాలాపన బాగున్నాయి.


ఈ సందర్భంగా మిత్రులందరికీ ఒక చిన్న సూచన. కేవలం కవితల్ని,గేయాల్ని, పద్యాల్ని చదవడం,పాడటమే కాకుండా వాటికి తగిన వ్యాఖ్యానం (స్వంతదయినా లేదా ఇతరులదయినా)జోడిస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుందేమో ఆలోచించండి.


మొత్తానికి సభ చక్కగా జరిగింది. కొసమెరుపుగా జాగ్స్ గారు చంద్రగారిని ప్రశంసిస్తూ పద్యమేదో చెప్పారు. జాగ్స్ గారూ ! ఆ పద్యమేదో ఇక్కడ పోస్ట్ చెయకూడదూ ?


కొత్త సంవత్సరంలో జరగబోయే ఆరవ సమావేశానికి మందపాటి సత్యంగారు ముఖ్య అతిధి అని ప్రకటించారు ఎంవీయెల్ ప్రసాద్ గారు. అయితే జనవరి నెలలో కూడా పసందయిన సాహితీవిందు ఉందన్నమాట !

Wednesday, December 19, 2007

మాయాబజారు

పేదలు లేని సమాజస్థాపనే నా ధ్యేయం-(చంద్రబాబు)-

అవునవును. మీ గత పాలనలో జరిగింది అదే.పేదరికాన్ని ఎలాగూ పోగొట్టలేం అని ఎరిగిన మీరు పేదల నిర్మూలన బాగా చేశారు అని మాకు తెలుసు.

ఎన్టీఆర్ వారసుడు వైయెస్సే- (పురంధ్రేశ్వరి)
-ఇదీ నిజమే.కాకుంటే చిన్న తేడా.అన్నగారు అనుకున్నది రామరాజ్యం. రాజావారు అనుకునేది ఇందిరమ్మ రాజ్యం.పనిలో పనిగా చిన్నమ్మాయి గారు "ఇందిరా తెలుగుదేశం" పార్టీని స్థాపించే ఆలోచన చేస్తే బాగుంటుంది అని ప్రజల విన్నపం.

గుజరాత్ తర్వాత మనమే-(వైయెస్)
-ఓహో పారిశ్రామికాభివృధ్ధిలోనా ? అణచివేతలో అనుకున్నాలెండి !

క్రైస్తవులకు అన్నివిధాల సహకరిస్తాం--(వైయెస్)
-క్రైస్తవులకా క్రైస్తవ పీఠాలకా అని చిన్న సందేహం

ఎసిబి కేసుల్లో వాస్తవం ఎంత ?-(జెసి దివాకర్ రెడ్డి)
-అవును సార్! అసలు ఒక పక్క మీ కారు డ్రైవర్లు, ఇంట్లో పాలేర్లు సిమెంట్ పరిశ్రమలు స్థాపించే స్థాయిలో ఎదుగుతుంటే, ఏదో రెండు లంచం రాళ్ళు తీస్కున్నంత మాత్రాన బక్క ఉద్యోగుల మీద ఎసిబి కేసులు పెట్టెయడమేనా ? మినిమం 100 కోట్లన్నా వెనకేస్కున్నాక ఎసిబి "వాస్తవం"గా కేసులు పెట్టాలని కోరుతున్నాం సార్ !

Friday, December 14, 2007

నెల్లూరు జిల్లా పేరు మార్పు అవసరమా ?

నెల్లూరు జిల్లా పేరుని పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది అని వార్త.

పొట్టి శ్రీరాములు గారు చిరస్మరణీయులు. ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం అసువులుబాసిన ఆ మహనీయుడ్ని సముచితరీతిన స్మరించుకోడం, గౌరవించుకోడం తెలుగువారి కనీస ధర్మం.

కానీ భారతదేశ చరిత్రలో "నెల్లూరు సీమ" అనే పేరు ఎన్ని శతాబ్దాలనుండో ప్రాచుర్యంలో ఉంది. ప్రాచీన శాసనాల్లో, కావ్యాల్లో, జానపదుల నోళ్ళల్లో నెల్లూరు అనే పేరు ప్రసిధ్ధం. పల్లవ,చోళ,చాళుక్య,కాకతీయ,విజయనగర సామ్రాజ్యాల్లో భాగమయి,విక్రమ సింహపురిగా, మనుమసిధ్ధి రాజధానిగా ప్రసిధ్ధమయి,తిక్కనతో ప్రస్తావించబడింది.నెల్లూరు నెరజాణ, నెల్లూరు బియ్యం అనే పదాల్ని వినని తెలుగువాడెవ్వడు ?

అంతటి ఘనచరిత్ర కలిగిన ఈ పేరుని మార్చడం అంత సమంజసమా అని నాకు అనిపిస్తుంది. పొట్టి శ్రీరాములు గారి పేరా లేదంటే ఇంకో మహానుభావుడి పేరా అనేది కాదు ఇక్కడ సమస్య. అసలు ఈ పేర్లు తగిలించే సంస్కృతి మూలాల్ని నాశనం చేస్తున్న తీరు బాధ కలిగిస్తున్నది.

యూనివర్సీటీలకి, విమానాశ్రాయాలకి,రోడ్లకి, ప్రాజెక్టులకి,అన్నిటికి నాయకుల పేర్లు పెడ్తున్నారు.బాగుంది. కొత్తగా కట్టేవాటికి ఏ పేరు పెట్టుకున్నా బాధ లేదు. కాని వందల ఏళ్ళుగా జనం నోళ్ళల్లో నానుతున్న పేర్లని మార్చేయడం ఆ మహనీయులకి ఏ విధమయిన నివాళో అర్ధం కాదు.

ఇంతకుమునుపు నెల్లూరు,గుంటూరు,కర్నూలు జిల్లాల్ని విడదీసి,కలిపి 1970 లో ఒంగోలు జిల్లాని సృష్టించారు.ఒంగోలు కూడా చాలా ప్రాచీనమయిన, ప్రసిధ్ధమయిన పేరు. 1972 లో దాని పేరు ప్రకాశం జిల్లాగా మార్చారు. ఒంగోలు జిల్లాని ప్రకాశం పేరుతో పిలవడం వల్ల ఆ మహానుభావుడికి కొత్తగా వచ్చే గౌరవం ఏమిటి ?

1978 మార్చ్ లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే, వారి మామగారు కొండా వెంకట రంగారెడ్డి గారి పేరు మీద రంగారెడ్డి జిల్లాని సృష్టించారు. అది కావాలని చేశారో, కాకతాళీయమో తెలియదు మరి.

మొన్నా మధ్య కృష్ణాజిల్లాని NTR జిల్లాగా పేరు మార్చాలని అభిమానులనుండి ఒక వెర్రి కోరిక. ఏమిటీ వెర్రి ? ఇంకో 20 ఏళ్ళు పోతే ఏ జిల్లా పేరు ఎలా మార్చేయగలరో ఊహిస్తే వళ్ళు జలదరిస్తుంది.

అసలు ఆ మహానుభావులేమన్నా అడిగారా మా పేర్లు పెట్టండి అని ? దీనికి అంతెక్కడ? ఒక పక్క బాంబే ముంబాయిగా, మెడ్రాస్ చెన్నయిగా పాతపేర్లు తగిలించుకుంటూ ఉంటే మనకేమిటి ఈ పైత్యం ?

Sunday, December 9, 2007

జై చిరంజీవ !





ఆంధ్రభూమిలో ఈ వారం 'వీక్' పాయింట్

Friday, December 7, 2007

2009 ఎలక్షన్ల ఫలితాలు

2009 ఎలక్షన్ల ఫలితాలు అప్పుడే వచ్చేశాయి ఇంటర్నెట్లో.
చిరంజీవి పైన ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసిన మోహన్ బాబు ఓటమి !
ముఖ్యమంత్రిగా చిరంజీవి ప్రమాణస్వీకారం
వైద్య ఆరోగ్య శాఖామంత్రి-- డా సమరం
ఆర్ధిక శాఖామంత్రి- అల్లు అరవింద్
సమాచార,పబ్లిసిటీ శాఖామంత్రి--Mr శ్రీజ శిరీష్
హోం మినిస్టర్- పవన్ కల్యాణ్
సాంస్కృతిక వ్యవహారాల శాఖామంత్రి- రవితేజ
ఆస్థాన సంగీత విద్వాంసుడు- దేవిశ్రీ ప్రసాద్
ఆస్థాన నిలయ విద్వాంసుడు- శ్రీకాంత్
పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు- అల్లు అర్జున్

ప్రతిపక్ష నాయకుడు- నందమూరి బాలక్రిష్ణ

లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సంతకం చేసిన మొదటి ఫైలు- "ఆర్య సమాజ్ లో ప్రేమ పెళ్ళిళ్ళని BAN చేయడం" !

ఇహ మాజీ ముఖ్యమంత్రులు- ఒకాయన ఫ్యాక్షన్ వ్యాపారాన్ని,ఇంకొకాయన తన పాలవ్యాపారాన్ని పునరుధ్ధరించుకుని శేషజీవితం గడుపుతూ " ఏ ఒక్కరికీ బాధ కలిగించకుండా " , "ఆ విధంగా ముందుకుపోతున్నారు".

కాబినెట్ విస్తరణకు చాలా ఖాళీ ఉంది. మీకు తోచినవారికి మీరు కూడా పదవులు, మంత్రిత్వ శాఖలు ఇచ్చుకోవచ్చు.

Tuesday, December 4, 2007

ఐదవ తెలుగువెన్నెల ప్రకటన

డిసెంబర్ 16వ తేదీన జరగబోతున్న ఐదవ తెలుగువెన్నెల సమావేశపు వివరాల్ని ఈ రోజు ప్రసాద్ తోటకూర గారు తెలుగువెన్నెల మిత్రులకి ఇ-మెయిల్ పంపారు. ఆ వివరాలు నేనిక్కడ పోస్ట్ చేస్తున్నాను.

తేదీ : ఆదివారం, డిసెంబర్ 16,2007
సమయం: మధ్యాహ్నం 3 గంటలనుండి సాయంత్రం 5 వరకు
వేదిక : RICE1ROLL ఇండియన్ రెస్టారెంట్

మనందరికీ రచయితగా సుపరిచితులు, మిత్రులు చంద్రశేఖర్ కన్నెగంటి గారు ప్రధాన వక్త

ఇక మన మిత్రులు ఏవయినా కథలు,కవితలు,పద్యాలు లేదా వేరేదయినా అంశాలు ఈ సమావేశంలో అందరితో పంచుకోదలిచితే, మిత్రులు ఎంవీయెల్ ప్రసాద్ గారికి(mvlprasad@gmail.com) డిసెంబర్ 13 వ తేదీ లోపల పంపించండి.

మారుతున్న ఈనాడు భాష

ఈ మధ్య ఒక రెండు,మూడు వారాలనుండి "ఈనాడు" దినపత్రిక భాషలో తేడా కనబడ్తున్నది.
ఇదివరకు యధాలాపంగా వాడే ఇంగ్లీష్ పదాల బదులుగా కొత్త తెలుగు పదాలు కనబడ్తున్నాయి.
ఈ మధ్య కాలంలో (ఇవాళ్టితో సహా)నేను గమనించిన పదాలు ఇవీ.
ఎడమవేపు మాములుగా వాడే ఇంగ్లీష్ పదాలు, కుడివేపు ఈనాడులో వాడుతున్న తెలుగు పదాలు.

కాంట్రాక్టర్ = గుత్తేదారు
జూనియర్ డాక్టర్స్ = చిన్న వైద్యులు (ఇంకా నయం..ఆంధ్రభూమిలాంటి పేపర్లు "జూడా"లు అంటున్నాయి. దారుణం !)
సెన్సార్ బోర్డ్ = ఉచితానుచిత నిర్ణాయక మండలి
టోల్ = సుంకం
సింగిల్ లైన్ = ఏక మార్గం

కాకపోతే ఈ తెలుగు పదాలపక్కనే బ్రాకెట్లలో(కుండలీకరణాలు సరయిన పదమా?)ఇంగ్లీష్ పదాన్ని కూడా ఇస్తున్నారు. మీరు చూసిన పదాలు ఇక్కడ పోస్ట్ చేయండి.

Monday, December 3, 2007

తి.తి.దే వారికి చిన్న సూచన


మళ్ళీ వారం మొదలయింది !

మళ్ళీ వారం మొదలయింది ! సంవత్సరం అయిపోతున్న భావం కలుగుతోంది మెల్లగా !
శనివారం సాయంత్రం కారుణ్య సంగీత విభావరి పుణ్యమా అని మళ్ళీ మిత్రుల్ని కలుసుకోడం జరిగింది.
పులిగండ్ల వారొచ్చారు సతీసమేతంగా.మలేషియా వెళ్ళడం వల్ల తెలుగు వెన్నెల సమావేశానికి రాలేకపోయారట. పునఃస్వాగతం !

ఈ వారం రెండు రేడియోల్లోనూ రెండు మంచి ప్రత్యేక కార్యక్రమాలొచ్చాయి.

శనివారం చంద్ర కన్నెగంటి, గోపాల్ గార్లు "ఆనందలహరి"లో "తెలుగు నవలా చిత్రాలు" అనే ప్రత్యేక రేడియో కార్యక్రమంలో, చలన చిత్రాలుగా మలచబడ్డ తెలుగు నవలల గూర్చి చక్కగా విశ్లేషణ చేశారు.

ఆదివారం "గానసుధ"లో తెలుగువెన్నెల మిత్రుడు నాగేశ్వర రావ్ చింతపెంట గారు "విజయావారి ఘంటసాల" అని ఒక చక్కని ప్రత్యేక కార్యక్రమం చేశారు. విన్నారా ? విజయా పిక్చర్స్ నాగిరెడ్డి , ఘంటసాల గార్ల జయంతుల్ని పురస్కరించుకుని, ఆ కార్యక్రమం రూపొందించాను అని చెప్పారు సినారా గారు.

చంద్రగారికి,గోపాల్ గారికి, నాగేశ్వర్రావ్ గారికి తెలుగు వెన్నెల అభినందనలు !!

Friday, November 30, 2007

చరిత్ర అడక్కు - చెప్పింది విను


"చరిత్ర అడక్కు - చెప్పింది విను" అని అదేదో సినిమాలో రావుగోపాలరావ్ అంటాడు. KCR అసలు చరిత్రనే తిరగరాసి, నిజాం భజన చేయడం వెనుక ఉన్న బహిరంగ రహస్యాన్ని ఆంధ్రభూమి ఎడిటర్ శాస్త్రి వ్రాసిన "వీక్ పాయింట్" అనే కాలంలో చదవండి !

రైతు గర్జనలో డల్లాస్







NRI TDP గురించీ, రైతు గర్జన గురించీ, అందులో NRI ల పాత్ర గురించీ, మన నగరానికి చెందిన నవనీత కృష్ణ, యార్లగడ్డ వెంకట్ ల గురించి ఆంధ్రభూమి అనే views paper లో ఈ రోజు వచ్చిన వార్త ఇది !

తెలుగు వెన్నెల

తెలుగు వెన్నెల వచ్చింది మన కోసం ...

మది నిండిన......మన ఊహలు.......

మధురమైన మన భావాలు............

నిదురించే .............మన................ హృదయాన్ని......తట్టి లేపుతుంది..

Wednesday, November 28, 2007

హ్యూస్టన్ లో తెలుగు పోటీలు !

హ్యూస్టన్ నగరంలో DEC 1,2007 , శనివారం నాడు,తానా, తెలుగు కల్చరల్ అసోసియేషన్(TCA)ఆఫ్ హ్యూస్టన్ వారు కలిసి పిల్లలకి,పెద్దలకి విడి విడిగా పోటీలు నిర్వహిస్తున్నారు.
పిల్లల్ని 3 విభాగాలుగా వర్గీకరించి, తెలుగులో వ్రాయడం, మాట్లాడ్డం, పదాల నిర్మాణం వంటి అంశాలలో పోటీలు పెడ్తున్నారు.

పెద్దలకి ఉపన్యాస పోటీలు ఉన్నాయి. ఒక్క ఆంగ్లపదం కూడా లేకుండా 3-5 నిమిషాలపాటు మాట్లాడాలి.మాట్లాడవలసిన టాపిక్ కూడా ఇచ్చేశారు.
"దేశభాషలందు తెలుగు లెస్స".

పోటీలు శనివారం మధ్యాహ్నం 3 గంటలనుండి సాయంత్రం 6 దాకా.
ఉచిత ప్రవేశం.ఉపాహారం కూడా ఉంది(ట).

సరదాగా డల్లాస్ మిత్రులం కలిసి వెళ్ళి హ్యూస్టన్ మిత్రులని కలిసి రావొచ్చు అనుకుంటే ఒక 5-6 మందిమి వీజీగా బయల్దేరి వెళ్ళి, చూసి, పిమ్మట సాయంకాలమునకు తిరిగి రావొచ్చును.

పోటీలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం కింది లింకు చూడండి.
www.teluguhouston.com

"అస్తమించని రవి"



మొన్నా మధ్య TANA సభలకి వాషింగ్టన్ DC వెళ్ళినప్పుడు బోలెడన్ని తెలుగు పుస్తకాలు కొనుక్కొచ్చుకున్నా. చాలావరకు చదివేయడం అయింది.చదివేసి ఊరుకోడం సరికాదు గనుక చదివాక మనకేం అర్ధం అయింది అనేది అందరితో పంచుకోవాలి గనుక నాలుగు ముక్కలు బరికేద్దామని నిర్ణయించా.


నేనిప్పుడు పరిచయం చేస్తున్న పుస్తకం పేరు "అస్తమించని రవి". రచయిత ఖాదర్ మొహియుద్దీన్. "పుట్టుమచ్చ" అనే ముస్లింవాద కవిత ద్వారా ప్రసిద్ధుడు.

ముందుమాటలొ రచయిత, పరిటాల రవి తాను ఫ్యాక్షనిస్ట్ ని కాదని నిరూపించుకునే ప్రయత్నం సఫలీకృతం కాకుండానే హత్య చేయబడ్డాడని, ఆ లోటు ని ఈ పుస్తకం కొంతవరకయినా తీరుస్తుందని ఆశిస్తున్నానని అభిప్రాయపడ్డాడు. అదే ముందుమాటలొ ఇంకో చోట "ఏ ముహుర్తాన గద్దరన్న(గద్దర్) పరిటాల రవిని పరిచయం చేసాడో గానీ, ఆ తర్వాత నేను పూర్తిస్థాయిలో రవి మనిషిగా మారిపోయాను" అని అంటాడు.


అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్లుగా, ఈఒక్క వాక్యం చాలు- మున్ముందు పుటల్లో పుస్తకం ఎలా ఉండబోతోందీ,ఏ కోణంలో మనం రవిని చూడబోతున్నాం అనే విషయం ఊహించడానికి.


మీకు పరిటాల నచ్చినా, నచ్చకపోయినా ఈ పుస్తకం మాత్రం బాగా చదివిస్తుంది.రాయలసీమ లొ, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో 5 దశాబ్దాలుగా కొనసాగుతున్న నరహంతక ఫ్యాక్షన్ ప్రవృత్తినీ,దాని పుట్టుపూర్వోత్తరాలనీ, ఫ్యాక్షన్ కి వ్యతిరేకంగా జనం పోరాటాన్ని,అందులో పరిటాల కుటుంబం పాత్రని వివరిస్తుంది.


రవి గురించి జనబాహుళ్యంలో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. రవిని రాబిన్ హుడ్ గా చూపించేవి కొన్ని. నెత్తురు తాగే ఫ్యాక్షనిస్టుగా చూపించేవి మరికొన్ని.ఈ పుస్తకంలో రవి ఆయుధాల్ని ఎందుకు పట్టాల్సి వచ్చిందో వివరించే "జస్టిఫికేషన్" ఉంది. కానీ రవి ఫ్యాక్షనిస్టు ఎందుకు కాదో రచయిత వివరించలేకపొయాడు. కొన్నిచోట్ల పక్షపాతం ప్రదర్శించినట్లుగా అనిపిస్తుంది.మరికొన్ని చోట్ల, ముఖ్యంగా రవి చేశాడని చెప్పబడ్తున్న హత్యల ప్రస్తావన వచ్చినప్పుడు, రచయిత దాటవేత ధోరణి అవలంబించాడనిపిస్తుంది.ఆ హత్యలు రవి చేసినవి కాదేమో, పీపుల్స్ వార్ గ్రూప్ చేసినవేమో అనే అనుమానం చదువరుల్లో రేకెత్తించే ప్రయత్నం కనబడ్తుంది.


ఏతావాతా చెప్పొచ్చేదేమంటే, "చరిత్ర" లో ఒక కోణం తెలుసుకోడానికి ఒకసారి చదవదగ్గ పుస్తకమే.కానీ ఇదే జరిగిన చరిత్ర అని మనల్ని నమ్మించగలిగే విశ్వసనీయత ఈ పుస్తకానికి ఉందా అంటే సందేహాస్పదమే.


పుస్తకం చదివాక మాత్రం ఒకటి అనిపిస్తుంది. కత్తి పట్టినవాడు ఆ కత్తి చేతిలోనే మరణిస్తాడు అని. ఆ ఫ్యాక్షన్ పద్మవ్యూహమే అలాంటిది. అందులోకి వెళ్ళడమే గాని, బయటికి రావడం అనేది బహు అరుదు.అది కేవలం వైయెస్ కి మాత్రమే సాధ్యం అయింది ! (ఇందులో ద్వంద్వార్ధం ఏమి లేదని గమనించగలరు)


వైయెస్ ని ఫ్యాక్షన్లోంచి బయటికి తీస్కురాగలం గానీ, వైయెస్ లో ఉన్న ఫ్యాక్షనిస్ట్ ని మాత్రం బయటికి తీయలేం అని విపక్షాల వాళ్ళూ, స్వపక్షాల వాళ్ళూ చమత్కరించడం వేరే సంగతి అనుకోండి !


కొసమెరుపు:


ఇదే వ్యక్తి పరిటాల రవీంద్రా రెడ్డి అయి ఉంటే అసలు ఈ వ్యక్తికి, కథకి,అతని హత్యకి ఇంత ప్రాముఖ్యత ఉండేదా,అతనికి అంత శతృత్వం ఉండేదా, వైయెస్ ప్రభుత్వం రాగానే అతని హత్య జరిగేదా, తెలుగుదేశం పార్టీ అంతగా రియాక్ట్ అయ్యేదా, తెలుగుదేశం అభిమానులు గుంటూరు,కృష్ణా జిల్లాల్లో అన్నగారి విగ్రహం పక్కనే ఇప్పటిలాగానే ఇతని విగ్రహాలు పెట్టి ఉండేవాళ్ళా(1989 లో కోస్తా జిల్లాల్లో వంగవీటి రంగా విగ్రహాల్ని ఇందిరమ్మ,రాజీవ్ విగ్రహాల పక్కన పెట్టినట్లుగా) ,2004 ఎన్నికల సమయంలో పార్టీలకి అతీతంగా రాయలసీమలో అంతటి పోలరైజేషన్,అన్ని రాజకీయ సమీకరణలు జరిగి ఉండేవా, ఇదే విధంగా చనిపోయిన బాంబుల శివా రెడ్డి లాంటి ఫ్యాక్షనిస్ట్ తెలుగుదేశం నాయకుల్ని TDP ఎందుకు అంతగా "గ్లోరిఫై" చేయలేదు ........ఈ ప్రశ్నలన్నీ నా మదిలో మెదుల్తున్నాయి..మీకు సమాధానం తెలిస్తే చెప్పండి.

మూడో తెలుగు వెన్నెల

మూడో తెలుగు వెన్నెల అక్టోబరు 21, 2007 న పసంద్ ఇండియన్ రెస్టారెంట్లో జరిగింది. ముఖ్య అతిధి ప్రముఖ కవి అఫ్సర్. "అమెరికా తెలుగు సాహిత్యం" అనే అంశం పైన అఫ్సర్ మాట్లాడారు. 60,70 దశకాల్లో వచ్చిన ప్రవాసాంధ్రుల సాహిత్యానికి, ఇప్పటి సాహిత్యానికి మధ్య పోలికల్ని, వ్యత్యాసాన్ని వివరించారు.

ఈ సమావేశంలో జాగ్స్ గారు మనుచరిత్ర పద్యాల్ని,జువ్వాది రమణ తిక్కన గోగ్రహణఘట్టం పద్యాల్ని, ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు గయోపాఖ్యానం పద్యాల్ని పాడి వినిపించారు. వారణాసి వెంకట్రావ్ గారు ఆయనే వ్రాసిన "ఋతుచక్రం" అనే నృత్యరూపకంలో నుండి కొన్ని గేయాల్ని మధురంగా పాడి వినిపించారు.

ఈ సమావేశం తాలూకు మరిన్ని వివరాలు ఈ లింకుల్లో చూడండి.
http://www.andhrajyothy.com/mainshow.asp?qry=2007/oct/24new17

రెండో తెలుగు వెన్నెల

ఇహ రెండో తెలుగు వెన్నెల సెప్టెంబరు 16, 2007 న అవర్ ప్లేస్ ఇండియన్ రెస్టారెంట్లో జరిగింది. ముఖ్య అతిధి ప్రొఫెసరు వేదాల శ్రీనివాసాచార్యులు గారు. ఓక్లహోమా సెంట్రల్ యూనివర్సిటీ లో వేదాంత,సంస్కృతాచార్యులుగా ప్రసిధ్ధులయిన వేదాల గారు ఓక్లహోమా హిందూ దేవాలయంలో అర్చకత్వం కూడా చేస్తారు.

ఇదే కార్యక్రమానికి ఇంకో విశిష్ట అతిధి న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చివుకుల ఉపేంద్ర గారు.

వేదాల గారు నన్నయాదుల కాలం నుండి 20 వ శతాబ్దం దాకా తెలుగు సాహిత్య పరిణామక్రమాన్ని వివరించారు.పోతన భాగవత విశేషాల్ని వర్ణించారు. రసరమ్యంగా గజేంద్రమోక్షఘట్ట పద్యాల్ని పాడి వినిపించారు.ఉపేంద్ర గారు తెలుగు భాషని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతని వివరించారు.

మిత్రులు జువ్వాది రమణ కొన్ని పద్యాల్ని చదివి వినిపించగా, చంద్ర కన్నెగంటి వ్రాసిన "వాన వెలసిన సాయంత్రం" కవితా సంకలనం నుండి ఒక కవితను నందివాడ ఉదయభాస్కర్ చదివి వినిపించారు.

ఈ సమావేశం తాలూకు మరిన్ని వివరాలు ఈ లింకుల్లో చూడండి.

http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2007/sep/18new16

http://www.idlebrain.com/community/etc/tantex-sahitya1.html

నెల నెలా తెలుగు వెన్నెల కథా కమీషు

బ్లాగ్ చదివిన మిత్రులు మరి కొంతమంది అడుగుతున్నారు."నెల నెలా తెలుగు వెన్నెల" సమావేశపు కథా కమీషు ఏమిటి అని.

"తెలుగు సాహిత్య వేదిక" జులై 2007 లో TANTEX (Telugu Association of North Texas) వారి అనుబంధ విభాగంగా బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీ రావు, తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆవుల మంజులత గారి చేతులమీదుగా డల్లాస్ లో ప్రారంభించబడింది.

ప్రతి నెలా మూడో ఆదివారం తెలుగు సాహితీ ప్రియులంతా కలిసి సమావేశం అయ్యే విధంగా నిర్ణయించుకుని, ఇలా జరిగే ప్రతి "నెల నెలా తెలుగు వెన్నెల" కి తెలుగు సాహిత్యంలో విశేష కృషిసల్పిన ప్రతిభామూర్తుల్ని ముఖ్య అతిధులుగా ఉపన్యసించడానికి ఆహ్వానించడం జరుగుతూ వస్తోంది.

ప్రతి నెలా డల్లాస్ లో ఉన్న ఏదో ఒక ఇండియన్ రెస్టారెంట్ యాజమాన్య మిత్రులు సహృదయంతో సమావేశానికి స్థలాన్ని, ఉపాహారాన్ని అందజేస్తున్నారు.ఈ కార్యక్రమం నాలుగు నెలలుగా అప్రతిహతంగా జరుగుతున్నదీ అంటే దానికి ముఖ్య కారణం మన ప్రసాద్ తోటకూర గారు.

ఈ పరంపరలో భాగంగా మొదటి "నెల నెలా తెలుగు వెన్నెల" ఆగష్టు 19, 2007 న ఇండ్యాఫ్యూజన్ రెస్టారెంట్ లో జరిగింది. ఫ్రముఖ సాహితీ వేత్త వంగూరి చిట్టెన్ రాజు గారు ముఖ్య అతిధులుగా వచ్చారు.సాహితీ వేదిక ఉద్దేశాల్ని, భవిష్యత్ విధివిధానాల్ని చిట్టెన్ రాజు గారి సూచనలతో ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణలు నీలదంత గారు రచించి వినిపించిన
మిరపకాయ బజ్జీ విలాపం

పుట్టితి ఆంధ్రదేశమున పొందితి ఆంధ్రుల చేవ ధాటిగా
పట్టితి ఛత్రమున్ మిరపబజ్జిగా నేలితి ఆంధ్ర భోజ్యమున్
మెట్టితి డల్లసున్ జనులు మెచ్చ సుభాష్ చలసాని లాఘవం
బట్టుగ నాకు పట్ట పరమార్ధము చెందితి కాని చెప్పెదన్
గట్టిగ ఈ ప్రవాసులు సగంబుగ అల్పినో కోసి పిండిలో
గుట్టుగ ముంచి ముంచి మరి గుండ్రని రూపమిచ్చి బజ్జిగా
పెట్టగ పేరు నాకు విలపించుట దప్ప మరేమి జేతునో


అంటూ ..పొడుగ్గా, ఘాటుగా అందమయిన ఆకృతిలో చూడగానే నోరూరించే మిరపకాయ బజ్జీ ప్రవాసుల చేతిలో పడి ఎలా గుండ్రంగా మారిందో హాస్యస్ఫోరకంగా ఈ పద్యం అందరినీ అలరించింది.

పద్యంలో సుభాష్ చలసాని ప్రస్తావన ఎందుకంటే ఆయనది బజ్జీలు చేయడంలో అందెవేసిన చేయి(ట).

ఇంకో ఆకర్షణ డాక్టరు ఆళ్ళ శ్రీనివాసరెడ్డీ గారు ఆలపించిన గీతాలు.

ఈ సమావేశం తాలూకు మరిన్ని వివరాలు ఈ లింకుల్లో చూడండి.

http://www.idlebrain.com/community/etc/tantex-sahitya.html

మా ఊరి కబుర్లు

నేను మా హ్యుస్టన్ కబుర్లు రాస్తున్నాను. హ్యుస్టన్ అయితేనేమిరా మరి డల్లాస్ అయితేనేమిరా ఎక్కడైనా తెలుగోడి గోడు ఒకటే అన్నట్లు...మేము ఇక్కడ కూడా తగినంత కలాపోసన చేస్తామండోయి. డిసెంబరు ఒకటవ తారీఖున మా తెలుగు సాంస్కృతిక సమితి తరఫున పిల్లలకి తెలుగు పోటీలు పెడుతున్నాము. ఈసారి విశేషం ఏమిటంటే వక్త్రుత్వ పోటీలు కూడా పెడుతున్నాము. పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా. చక్కటి తెలుగులో ఎక్కడా ఒక్క ఆంగ్ల పదం దొర్లకుండా ఇచ్చిన అంశం మీద మాట్లాడాలి. పోటీలు అయిపోయాక మరిన్ని వివరాలు ఇస్తాను. ఇక్కడ బ్లాగేందుకు అవకాశం ఇచ్చిన చేకూరి గారికి ధన్యవాదాలు తెలుపుకుని శలవు తీసుకుంటాను ..

.హ్యుస్టన్ నుంచి ఉమాదేవి

Tuesday, November 27, 2007

తెలుగులో బ్లాగడం ఎలా ?

మిత్రులు కొంతమంది అడుగుతున్నారు. తెలుగు లిపిలో బ్లాగ్ లో పోస్ట్ చేయడం ఎలా అని.www.lekhini.org లోకి వెళ్ళండి.మీరు ఒక పానెల్ లో ఇంగ్లీష్ లో టైప్ చేస్తే కింద ఉన్న పానెల్ లో తెలుగులో వస్తుంది.దాన్ని కాపీ చేసి మన బ్లాగ్ లో create new post లో ఉన్న పానెల్ లొ పేస్ట్ చేయండి. ఖేల్ ఖతం !

Monday, November 26, 2007

Coppell లో శ్రీ శ్రీ

సీసంతో జాగ్స్ గురువుగారు ఒకటిస్తే,
నా తడాఖా చూడమంటూ MVL గారు ఏకంగా శ్రీ శ్రీ నే ఆవాహన చేసారు.
చదివి ఆనందించండి !!
కెసి గారి కమ్మనైన చిరు కబుర్లు

(శ్రీ శ్రీ గారి "మహాప్రస్థానం" స్ఫూర్తి తో)

కెసి గారి కమ్మనైన చిరు కబుర్లలో
రాతలు, తవికెలు, కెలుకులు
రవికెలు, రాత్రులు, కులుకులు
అన్న మాటలతో "బ్లాగు" ప్రపంచాన్ని ఖగేల్మనిపిస్తున్నారు
ఆంధ్ర దేశపు కుల కౌటిల్యాన్ని, కల్మషాన్నికీబోర్డు నొక్కులతో వెన్ను పోటేసారు
అగ్గిపెట్టె, నాటు బాంబు, పొగచుట్ట
అన్నీ ఒకే జేబులో ఉండే పలనాటి సీమ నుండి
కూటికోసం, కూలికోసం
డల్లాసు నగర తెలుగువారి పరివర్తన కోసం
మనకోసంవచ్చిన కేసి గారి "బ్లాగు"ను
నేను సైతం,
మీరు సైతం,
మనమందరం దర్శిద్దాం, బలోపేతం చేద్దాం
తెలుగువార! ఆంధ్రులార!
డల్లాసు నగర పురప్రముఖులార!
కులాచార బాధా సర్ప ద్రష్టులార!
ఆ దేశపు కులాచార కట్టుబాట్లతో
ఈ దేశపు కులాతీత సాంప్రదాయాల మధ్య
కాల దేవత రధ చక్రపు
టిరుసులలో పడి నలిగిన తెలుగువార !
లేవండి, ఇక చదవండి
మన కెసి గారి "బ్లాగు"ను

రాయండి దానిలో
మీ హౄదయంలో
ఎప్పుడో, ఎక్కడో,
ఎందుకో పదిలంగా రాసుకున్న,
దాచుకున్నమాటలను, చేతలను

అప్పుడే
నిజంగానే నిఖిలలోకం
నిండు హర్షం ప్రకటిస్తుంది
మానవాళికి నిజంగానే
మంచికాలం వస్తుంది

(శ్రీ శ్రీ గారి "మహాప్రస్థానం" స్ఫూర్తి తో)

ఎంవీయెల్ ప్రసాదు
(కార్తీక సోమవారం నవంబరు 26, 2007)

డల్లసు తెలుగు తల్లికి మల్లెపూలు




డల్లాస్ సాహితీ మిత్రులందరినీ అభినందిస్తూ జాగ్స్ మాష్టారు మల్లెపూల సౌరభంతో ఒక పద్యాన్ని సంధించారు. నెల నెలా విరగకాస్తున్న తెలుగు సాహితీ కౌముదిని అనుభవించే అదృష్టం మనకిచ్చిన తెలుగుతల్లికి జగదీశుని వందనాపూర్వక భక్తిమల్లెలు !




"డల్లసు తెలుగు తల్లికి మల్లెపూలు"


(ఆచార్య. పుదూర్ షణ్ముఖ జగదీశ్వరన్)



సీ ప్రాకుచున్నది గదా వైభవమ్ములతోడ


మధురంపు పులిగండ్ల వారి గరిమ


వెలయుచున్నది గదా విభవన్మహాశ్రీల


సొంపైన శ్రీనివాసుల యశస్సు


పరిఢవిల్లును గదా ప్రాభవములతోడ


సహౄదయపూర్తి ప్రసాదు కీర్తి


ఇనుమడించును గదా ఇష్టార్ధములతోడ


రమ్యంపు కల్వల రావు సొగసు


స్ఫూర్తిజెందును గదా సురకాంతలను మించు


ఘనమైన జగదీశు కవనకాంత


ఖ్యాతి కెక్కును గదా నీతి దర్పముతోడ


కోమలంబగు తోటకూర ప్రతిభ



తేగీ నెల నెల వెల్గు తెలుగు వెన్నెలల వల్లన


దీని తోడైన చేకూరి దీవెనలతో


దొర్లుచున్నది తెలుగు కబుర్లు సతము


డల్లసు తెలుగు తల్లికి మల్లెపూలు



(ఆచార్య. పుదూర్ షణ్ముఖ జగదీశ్వరన్)


(నవంబరు 26, 2007)






మార్పులు చేర్పులు

మన blog కి కొన్ని చిన్న మార్పులు చేర్పులు చేయడం జరిగింది.
KC కబుర్లు అనేది అప్పుడెప్పుడో పెట్టిన పేరు. దాని కన్నా అందరికీ వర్తించే విధంగా ఇంకో పేరు బాగుంటుంది అని నేను అనుకుంటున్న సమయంలో,
MVL ప్రసాద్ గారు కమ్మనయిన చిరు కబుర్లు అనే పదాన్ని వాడారు. KC కబుర్లు అనే అర్ధం వచ్చే విధంగా . ఇకపైన ఈ blog ని "డల్లాస్ తెలుగు వెన్నెల" గా వ్యవహరించడం జరుగుతుంది.
అందరికీ సమ్మతమే గదా ?

ఇక చేర్పు ఏమిటి అంటే blog లో మిత్రులందరినీ భాగస్వాముల్ని చేయడం.
దీనివల్ల ఎవరి దురద ని వారే గోక్కోవచ్చు. అంటే మీ రాతల్ని మీరే పోస్టుకోవచ్చు.
మధ్యలో నేను పూజారి పాత్ర ధరించే అవసరం ఉండదు.
బహుశా రాత్రిలోపు ఆ పని కూడా చేసేస్తా.

తుపాకీ--భుజం


పాత రోజుల్లో శ్రోత్రియ బ్రాహ్మణ వ్యావహారికంలో "అబ్బాయికి ద్వితీయం (ట)" అనేవాళ్ళు. అంటే రెండో పెళ్ళి అని. అకస్మాత్తుగా అదెందుకు గుర్తొచ్చింది అంటే , ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి వార్తాపత్రికలు, ఇంకా నానారకాల గాసిప్ లు వ్రాసే సైట్లూ..ఒహటేమిటి..ఎక్కడ చూసినా ఒకటే హడావిడి.
"తృతీయం" అని..అంటే మూడో పెళ్ళి కాదు సుమండీ !
రాష్త్రంలో రాజకీయ సమీకరణాలు మూడో ప్రత్యామ్నాయాన్ని సృష్టించే దిశగా మారుతున్నాయి అని views papers భోగట్టా !

జనాభా లొ 4%-5% ఉన్న కమ్మ దొరలూ, 6%-8% ఉన్న రెడ్డి రాజులు మాత్రమే రాష్ట్రాన్ని గత 50 ఏళ్ళుగా పరిపాలిస్తున్నారు.కాంగ్రెస్ రెడ్ల పార్టీగా, తెలుగుదేశం కమ్మవారి సొత్తుగా మారిపోయింది అని ఆ రెండు పార్టీల్లో ఉన్న "వెనుకబడిన" (పదవుల్లో కాదులెండి) వర్గాల నాయకులు, మరికొంతమంది BC సంఘాల నాయకులు గొంతెత్తి చెబ్తున్నారు !

నిజానికి 1983 కి ముందు తారకరాముడు ఆంధ్రరాజకీయ యవనిక మీద అవతరించేదాకా కమ్మ-రెడ్డి సోదరులు అధికారాన్ని బాగానే పంచుకున్నారు. సింహభాగం రెడ్డి సోదరులది.కాంగ్రెస్ లో ఉన్న కమ్మసోదరులకి కొంతమేరకు ప్రాముఖ్యత. గొడవంతా నాదెండ్ల భాస్కర్రావ్ బదులు భవనం వెంకట్రాం రెడ్డి ని ముఖ్యమంత్రిని చేయడంతో మొదలయింది.కోస్తా కమ్మవాడిని కావడం వల్లనే తనకి ఆ పదవి రాకుండా రెడ్లు అడ్డుకున్నారని ఆయన బాధ.తెలుగు దేశం పార్టీ పుట్టుకకి గల సవాలక్ష చారిత్రక కారణాల్లో ఇదొకటి.

NTR (తెలుగుదేశం) వెనుక వ్యూహకర్తగా నాదెండ్ల వేసిన "వెనుకబడిన వర్గాల" ఎత్తుకి కాంగ్రెస్ చిత్తయింది.అప్పటిదాకా ఇందిరమ్మ ఏం చేసినా, ఏ పధకాలు పెట్టినా అవన్నీ SC/ST లకే దక్కుతున్నాయి..పైగా అధికారంలో ఏమాత్రం భాగస్వామ్యం లేదు అనే వెనుకబడిన (BC) కులాల అసంతృప్తిని తెలుగుదేశం విజయవంతంగా ఓట్ల రూపంలోకి మార్చుకుని అధికారంలోకి వచ్చింది.

ఇదిగో..సరిగ్గా అప్పటినుంచే "వేరే(కులం)వాడి భుజం మీద తుపాకీ ఉంచి ప్రత్యర్ధిని కాల్చడం" అనే (కమ్మ-రెడ్డి)రాజకీయ టక్కుటమార గోకర్ణ విద్యాప్రదర్శన మొదలయింది.మొదటిసారిగా BC లని అడ్డం పెట్టి, రెడ్ల రాజకీయ ఆధిపత్యానికి కమ్మలు అడ్డుకట్ట వేశారు. ఇహ ఆ తర్వాత కరణీకాల రద్దు విషయంలో బ్రాహ్మణుల్ని "కమ్మ" పాలనకి వ్యతిరేకంగా కూడదీయడంలో కాంగ్రెస్ రెడ్లు కొంతమేరకు కృతకృత్యులయ్యారు. కానీ తెలుగుదేశానికి/ కమ్మ పాలనకీ అసలయిన దెబ్బ తగిలింది 1989 లోనే. కాంగ్రెస్ రెడ్లు 1983లో TDP కమ్మలు వేసిన అస్త్రాన్ని వాళ్ళ మీదకే ప్రయోగించారు. ఈసారి తుపాకీ మోసిన భుజం కాపు సోదరులది. రంగా హత్య, తదనంతర పరిణామాలతో రెడ్లకే మళ్ళీ అధికారం చేజిక్కింది. తిరిగి 2004 లో ఇదె సూత్రాన్ని రాజశేఖర రెడ్డి విజయవంతంగా ఉపయోగించగలిగాడు.

ఇదంతా చూస్తే మనకో సందేహం రావొచ్చు. TDP కాంగ్రెస్ ల మధ్య పోటీ కమ్మ-రెడ్డి వర్గాల మధ్య అధికారపోరుగా ఎందుకు చిత్రీకరించబడ్తున్నది అని. ఎందుకంటే గత 20 సంవత్సరాల్లో రాష్త్ర రాజకీయాల్లో అంతర్లీనంగా ప్రారంభమయిన ఈ ట్రెండ్ 2004 ఎన్నికల సమయానికి నిర్లజ్జగా బహిర్గతమయ్యింది.

ఉండవల్లి భుజంపైన తుపాకీ పెట్టి వైయెస్ రామోజీని కాల్చడం, గుంటూర్ మేయర్ పదవికి కన్నా ని రాయపాటికి చెక్ గా పెట్టడం, కొస్తా జిల్లాల్లో నియోజకవర్గాల పునర్విభజన..ఇవి కొన్ని ఉదాహరణలు.
ఇక చంద్రబాబు కర్నూలు జిల్లాలో కెయి క్రిష్ణమూర్తి వర్గాన్ని, ఫరూక్ ని భూమాకి (రెడ్లకి) సమాంతరంగా తయారు చేయడం, కడప లో రాంచంద్రయ్య లాంటి బలిజ నాయకుల్ని ఎదిగేట్టు చేయడం రాయలసీమలో రెడ్లకి చెక్ పెట్టడానికి చేసిన ప్రయత్నంలానే కనబడ్తుంది.

మొహమాటానికి, మర్యాద కోసం, కాదని మనం సర్ది చెప్పుకున్నా అక్కడ జరుగుతున్నది అదే.

ఇప్పుడు ఈ తృతీయ ప్రత్యామ్నాయం రావల్సిన అవసరం చాలా ఉంది. రెడ్లు (90 పై చిలుకు), కమ్మలు (25 దాక) కలిపి మొత్తం 125 మంది MLA లు ఉన్నారు ప్రస్తుత అసెంబ్లీ లొ. రాష్త్ర జనాభా 10 కోట్లు అనుకుంటే మొత్తం కమ్మ-రెడ్ల జనసంఖ్య కోటికి మించదు.ఈ కోటి మందిలో రెడ్డి అయినా, కమ్మ అయినా సరిగ్గా కులం వల్ల అధికారాన్ని అనుభవించేవాళ్ళు, లాభపడేవాళ్ళు, సంపాదించేవాళ్ళు మొత్తం మీద 25 వేలకి మించరని నా అంచనా. పోనీ ఒక లక్ష మంది.

మిగిలిన 99 లక్షలమందీ "ఊపెకుహ"లే.ఏదో "మా కులానిదే అధికారం" అని తుత్తి తప్ప వీళ్ళకి ఒరిగేదేం లేదు. పైగా కులాల గొడవలు..కక్షలూ, కార్పణ్యాలు తప్ప దానికి తోడు అధికారంలో భాగస్వామ్యం లేని మిగతా కులాలతో అకారణ శతృత్వం,ద్వేషం ఏర్పడటం ! పైగా ఏ పని చేసినా వాడు ఫలానా కులం కాబట్టి ఆ సందర్భంలో అలా చేశాడు అని ఒక రకమయిన TAG ..అలానే చేస్తాడు అని ఒక brand !

ఏ కులపోడు అధికారంలో ఉన్నా సామాన్యుడికి ఒరిగేదేం లేదు. అందరికీ తెలిసిందే అది !అందుకనే రాష్త్రంలో తృతీయ ఫ్రంట్ రావాలి..

కనీసం సంబంధం లేని విషయాలకి బూతులు తిట్టించుకునే బాధ తప్పుద్ది !

కారుణ్య సంగీత విభావరి


నవంబర్ నెల సందడి గురించి నిన్న పోస్ట్ చేయగానే,రాబోయే రోజుల్లో హడావిడి కూడా గుర్తొచ్చింది.December 1st 2007 -శనివారం నాడు సాయంత్రం 7:30 లకు SMU McFarlin Auditorium లో TANTEX వారి సహసమర్పణలో - మన తెలుగు కుర్రవాడు కారుణ్య సంగీత విభావరి- జరగబోతోంది.

ఆంధ్రా సరిహద్దులు దాటితే సత్తా ఉన్న తెలుగోడిని ఇండియాలో ఎక్కడయినా తొక్కేయడానికి ప్రయత్నం చేస్తారన్నది పచ్చి నిజం. Indian idol పోటీలో జరిగింది అదే. కానీ, బంతిని నేలకి ఎంత బలంగా కొడ్తే అంత బలంగా పైకి లేస్తుంది.సత్తా ఉన్నోడు ఎప్పుడయినా నిరూపించే విషయం అదే.కారుణ్య ప్రస్తుతం గళమెత్తి మరీ ఋజువు చేస్తున్నదీ అదే.

ఈ కార్యక్రమంలో మన మిత్రుల్ని కొందర్నయినా కలుసుకునే అవకాశం ఉంటుందనుకుంటా.

Sunday, November 25, 2007

అసలేం జరుగుతోందిక్కడ ?

అసలేం జరుగుతోందిక్కడ ?

డల్లాస్ తెలుగోడి జీవితం 3 ఫంక్షన్లు, 6 సినిమాలుగా వర్ధిల్లుతోందని మాత్రం కీబోర్డ్ గుద్ది మరీ చెప్పొచ్చు.
రెండు తెలుగు రేడియో కార్యక్రమాలు, మూడు సినిమా కాంప్లెక్స్ ల్లో ముప్పూటలా తెలుగు సినిమాలు, ఇవి కాక నెలకోసారి ఠంచనుగా ఏదో ఒక "పండగ" !!

నవంబర్ నెలనే తీసుకుంటే

3 వ తారీఖున TANTEX దీపావళి వేడుకలు,
10 న దీపావళి మేళా,
16 న Happy Days సినిమా వేడుకలు,
18 న "నెల నెలా తెలుగు వెన్నెల"..

నిజంగా వినేవాడికి అసూయ కలిగించేలా వుంది డల్లాస్ తెలుగోడి జీవితం !!

రైతు గర్జన

రైతు గర్జన బాగా విజయవంతమయిందని వార్త.
గర్జించీ గర్జించీ మూగవోయిన చంద్రన్న గొంతే దానికి సాక్ష్యం అంటున్నారు అభిమానులు.
చంద్రబాబు బాగా గర్జించారని, రైతన్నలు బాగా ప్రతిస్పందిచారని కూడా వినబడ్తోంది.
ఇంతకీ Dr Navaneeta Krishna గారి పేరు కూడా అడపా దడపా దినపత్రికల్లో, TV ఛానెళ్ళల్లో వినిపించిందని వినికిడి.
రైతు గర్జనలో పాల్గొనేటందుకు నవనీత గారు పోయిన వారమే విజయవాడ వెళ్ళారు.
ఇలాంటి గర్జనలు విజయవంతం అయ్యేకొద్దీ తెలుగుదేశం పార్టీ టికెట్లకి డిమాండ్ పెరుగుతుందనేది మాత్రం సత్యం !

నాలుగో తెలుగు వెన్నెల


మొదటి పోస్ట్ ఏం వ్రాద్దామా అని ఎక్కువగా ఆలోచించే అవసరం లేకుండా , నవంబర్ 18 న జరిగిన నాలుగో తెలుగు వెన్నెల గురించే సరదాగ మరోసారి గుర్తు చేసుకుందాం అనిపించింది.

గడచిన మూడు సమావేశాలకంటే ఈసారి కొంత విభిన్నంగా జాగ్స్ మాష్టారు (Prof. Jagadeeswaran Pudur) మిత్రులందరితో తేటగీతి పద్యాన్ని నిర్మించడం ఎలా అని సాధన చేయించడం బాగుంది.

జాగ్స్ గారు 1, 2 అంకెల్తో ఇంద్ర,సూర్య గణాల్ని బోర్డ్ మీద చూపిస్తుంటే అప్పుడెప్పుడో బళ్ళో Binary System గురించి చదువుకున్న విషయం గుర్తుకొచ్చింది.

MVL ప్రసాద్ గారు, ప్రసాద్ తోటకూర గారు చెలరేగిపోతున్నారు... పద్య పాదాల్ని గబగబా వ్రాసేస్తున్నారు !
బహుశా జాగ్స్ గారితో చాటుగా జరిగే ఘాటయిన చాటుపద్య సమావేశపు ప్రభావమేమో !

ఆళ్ళ శ్రీనివాసుడు ఈసారి ఏదో "గుండె కోత" లో బిజీగా ఉన్నట్లున్నారు ! పులిగండ్ల వారు ఈ మధ్య బొత్తిగా ఆకుచాటు పిందె లాగ తయారయ్యారు. అయ్యా ! తమరు కనబడాలి అప్పుడప్పూడూ !

ఈ నెల తెలుగు వెన్నెలకు కొసమెరుపు ఏమిటంటే, గత కొద్దివారాలుగా, తన ఆంగ్లవిద్యా పాండిత్యంతో, లేఖా సాహిత్యంలో (అంటే E-mail literature అని చదువుకోగలరు) "బందరు" సముద్ర తీరంలో కార్తీక "చంద్రు"డిలా ప్రకాశిస్తున్న మిత్రుడొకరు సమావేశానికి రావడం !

మిత్రులంతా కాచుకోండి ! ముందుంది మొసళ్ళ పండగ !!

ఏదో వ్రాయాలని !!

ఏదో వ్రాయాలని, నా పైత్యాన్ని డల్లాస్ తెలుగు మిత్రులతో పంచుకోవాలని ఒకానొక బలహీన క్షణంలో కలిగిన బలమయిన కోరిక ఈ blog పుట్టుకకి దారితీసింది. అదెప్పుడో July 2007 లో మాట.అక్కడ్నుంచి బండి ముందుకి కదలలేదు.

ఈ 5 నెలల కాలంలో డల్లాస్ లో చాలామంది ప్రముఖుల్ని సాహితీ ప్రియుల్ని,వివిధ రంగాల్లో నిష్ణాతుల్ని కలుసుకోడం తటస్థించింది.అందులో చాలామంది మిత్రులయ్యారు కూడా.ఏదో ఒక సదస్సు లేదా పార్టీ లేదా ఫంక్షన్ లో వీళ్ళందరినీ తరచుగా కలుసుకోడం జరుగుతూనే ఉంది.

ముఖ్యంగా ప్రసాద్ తోటకూర గారి చొరవతో తెలుగు సాహిత్య వేదిక ప్రారంభం అయ్యాక సందడి బాగా పెరిగింది.నెల నెలా తెలుగు వెన్నెల కురవడం మొదలయ్యాక మిత్రులందరికీ భావాల్ని అనుభవాల్ని పంచుకోడానికీ సరయిన వేదిక దొరికినట్లయింది.

నిజం చెప్పొద్దూ ! ప్రతి నెలా మూడో ఆదివారం వచ్చేదాకా తెలుగు వెన్నెల కోసం ఆగాలంటే చకోరపక్షి ఎదురుచూపులానే ఉంది.

అందుకని,ఈ నెల రోజులపాటూ మిత్రులందరి మధ్య సూత్రసంధానం చేయడానికి ఈ blog బాగుంటుందేమో అని చిన్న ఆలోచన వచ్చింది.

ఇందులో నేనొక్కడ్నే కాదు..మీరందరూ ఏదో ఒకటి కెలకొచ్చు. తెలుగు లిపిలో ఎలా వ్రాయాలో తెలియకపోతే మీకు సహాయం చేయడానికి నేనున్నాను !లేదంటే నాకు మీరు వ్రాసిన విషయాన్ని English letters లో టైప్ చేసి E-mail చేస్తే దాన్ని తెలుగు లిపిలో నేను ఈ blog లో పోస్టుతా !

ఇంకెందుకు ఆలస్యం ? కలాలు..సారీ..కీబోర్డులు ఝళిపించండి !

ఇంతకీ ఏం వ్రాయలని ఆలోచిస్తున్నారా ?
ఏదయినా వ్రాయొచ్చు మాష్టారూ ! కథలు, కవితలు, పాటలు, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, డల్లాస్ తెలుగోడి జీవితం, మీ ఆఫీస్ కబుర్లు..ఏదయినా పర్లేదు !

కాదేదీ బ్లాగుకనర్హం అని శ్రీశ్రీ గారే సెలవిచ్చారు !!