Wednesday, November 28, 2007

నెల నెలా తెలుగు వెన్నెల కథా కమీషు

బ్లాగ్ చదివిన మిత్రులు మరి కొంతమంది అడుగుతున్నారు."నెల నెలా తెలుగు వెన్నెల" సమావేశపు కథా కమీషు ఏమిటి అని.

"తెలుగు సాహిత్య వేదిక" జులై 2007 లో TANTEX (Telugu Association of North Texas) వారి అనుబంధ విభాగంగా బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీ రావు, తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆవుల మంజులత గారి చేతులమీదుగా డల్లాస్ లో ప్రారంభించబడింది.

ప్రతి నెలా మూడో ఆదివారం తెలుగు సాహితీ ప్రియులంతా కలిసి సమావేశం అయ్యే విధంగా నిర్ణయించుకుని, ఇలా జరిగే ప్రతి "నెల నెలా తెలుగు వెన్నెల" కి తెలుగు సాహిత్యంలో విశేష కృషిసల్పిన ప్రతిభామూర్తుల్ని ముఖ్య అతిధులుగా ఉపన్యసించడానికి ఆహ్వానించడం జరుగుతూ వస్తోంది.

ప్రతి నెలా డల్లాస్ లో ఉన్న ఏదో ఒక ఇండియన్ రెస్టారెంట్ యాజమాన్య మిత్రులు సహృదయంతో సమావేశానికి స్థలాన్ని, ఉపాహారాన్ని అందజేస్తున్నారు.ఈ కార్యక్రమం నాలుగు నెలలుగా అప్రతిహతంగా జరుగుతున్నదీ అంటే దానికి ముఖ్య కారణం మన ప్రసాద్ తోటకూర గారు.

ఈ పరంపరలో భాగంగా మొదటి "నెల నెలా తెలుగు వెన్నెల" ఆగష్టు 19, 2007 న ఇండ్యాఫ్యూజన్ రెస్టారెంట్ లో జరిగింది. ఫ్రముఖ సాహితీ వేత్త వంగూరి చిట్టెన్ రాజు గారు ముఖ్య అతిధులుగా వచ్చారు.సాహితీ వేదిక ఉద్దేశాల్ని, భవిష్యత్ విధివిధానాల్ని చిట్టెన్ రాజు గారి సూచనలతో ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణలు నీలదంత గారు రచించి వినిపించిన
మిరపకాయ బజ్జీ విలాపం

పుట్టితి ఆంధ్రదేశమున పొందితి ఆంధ్రుల చేవ ధాటిగా
పట్టితి ఛత్రమున్ మిరపబజ్జిగా నేలితి ఆంధ్ర భోజ్యమున్
మెట్టితి డల్లసున్ జనులు మెచ్చ సుభాష్ చలసాని లాఘవం
బట్టుగ నాకు పట్ట పరమార్ధము చెందితి కాని చెప్పెదన్
గట్టిగ ఈ ప్రవాసులు సగంబుగ అల్పినో కోసి పిండిలో
గుట్టుగ ముంచి ముంచి మరి గుండ్రని రూపమిచ్చి బజ్జిగా
పెట్టగ పేరు నాకు విలపించుట దప్ప మరేమి జేతునో


అంటూ ..పొడుగ్గా, ఘాటుగా అందమయిన ఆకృతిలో చూడగానే నోరూరించే మిరపకాయ బజ్జీ ప్రవాసుల చేతిలో పడి ఎలా గుండ్రంగా మారిందో హాస్యస్ఫోరకంగా ఈ పద్యం అందరినీ అలరించింది.

పద్యంలో సుభాష్ చలసాని ప్రస్తావన ఎందుకంటే ఆయనది బజ్జీలు చేయడంలో అందెవేసిన చేయి(ట).

ఇంకో ఆకర్షణ డాక్టరు ఆళ్ళ శ్రీనివాసరెడ్డీ గారు ఆలపించిన గీతాలు.

ఈ సమావేశం తాలూకు మరిన్ని వివరాలు ఈ లింకుల్లో చూడండి.

http://www.idlebrain.com/community/etc/tantex-sahitya.html

No comments: