Friday, February 1, 2008

పాతబస్తీనా లేక పాకిస్తానా ?

ఒకటే రోజు రెండువార్తలు చదివాను.ఆలోచనల్ని వికలం చేసే వార్తలు.

మొదటిది సాక్షాత్తూ ఒక రాష్ట్రమంత్రివర్యులు మజ్లిస్ శాసనసభ్యుల ముందస్తు అనుమతి లేకుండా పాతబస్తీలో ఆకస్మిక తనిఖీలకి వెళ్ళినందుకు మజ్లిస్ కి కోపం రావడం--దానికి సంజాయిషీగా మంత్రి కాసు కృష్ణారెడ్డి అసదుద్దీన్ ఒవైసీ కార్యాలయానికి వెళ్ళి క్షమాపణలు అడగడం !

రాష్ట్రప్రజలకి ప్రాతినిధ్యం వహించే ఒక మంత్రికే దిక్కులేకపొతే ఇక మామూలు ప్రజలకి పాతబస్తీలో నోరు తెరిచే అవకాశం ఉంటుందా ? అన్ని హంగులతో, బందోబస్తుతో వెడలిన మంత్రిగారే మజ్లిస్ కార్యకర్తలు నిలేస్తే జావగారిపొయారంటే అక్కడ నడుస్తున్నది ప్రభుత్వమా లేకుంటే ఒవైసిమార్క్ గూండాయిజమా ?

ఇక రెండో వార్త -- ఒక వాటర్ బోర్డ్ అధికారి "పాతబస్తీలో పనిచేస్తున్నా, నాకు పాకిస్తాన్ లో ఉన్నట్లుగా ఉంది. నా పని నేను చేసుకుపోలేని పరిస్థితి. ఇక్కడసలు చట్టం అమలు అవుతుందా అని అనుమానం వేస్తుంది. నన్ను బదిలీ చేయండి ప్రభో " అని ఉన్నతాధికారులకి మొరపెట్టుకున్నారని దినపత్రికల్లో వచ్చింది.

పాతబస్తీలో మజ్లిస్ గూండాలు చెప్పిందే వేదమా ? ప్రభుత్వచట్టాల్ని అమలు చేసే దమ్ములు ఎవరికీ లేవా ?పరిపాలనాకేంద్రమయిన రాష్ట్ర రాజధానిలోనే ఒక ప్రాంతంలో వాటర్ బిల్లులు,కరెంట్ బిల్లులు,ఇంటిపన్నులు వసూలు చేయలేకపోతే నిజంగా రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా అన్న అనుమానం వస్తున్నది.

సమస్య మైనారిటీలకి సంబంధించింది కాదు. పాతబస్తీలో హిందువులయినా, ముస్లింలయినా ఇదే పరిస్థితి.కూలీనాలీ చేసుకుని పొట్టబోసుకునే బడుగుజీవులు ముస్లిములయినా, హిందువులయినా మజ్లిస్ కి వ్యతిరేకంగా నోరెత్తే సాహసం చేయలేరు.ముషారఫ్ పాలిస్తున్న పాకిస్తాన్ కి ఏ మాత్రం తీసిపోని వారసత్వ నియంతృత్వ సామ్రాజ్యం నడుపుతూ దానికి మైనారిటీల హక్కులు అనే ముసుగు తగిలించి బతుకుతున్న ఈ పరాన్నభుక్కులు వై.యెస్ ప్రభుత్వం వచ్చాక పేట్రేగిపోవడం ఎక్కువయింది.

ముస్లిం సోదరులకి సహాయం చేయడం అంటే మజ్లిస్ ని పెంచిపోషించడం కాదు అని రాజశేఖరునికి తెలియని రాజనీతి కాదు.కాకుంటే ఓటుబ్యాంకు రాజకీయాల్లో పడిపోయి, రానున్న ప్రమాదాన్ని గుర్తించి కూడా విస్మరిస్తున్నారు.అంతే. మావోయిస్టుల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చిచంపిన ఈ ప్రభుత్వం, మజ్లిస్ గూండాయిజం కి వ్యతిరేకంగా ఏ చర్యా తీసుకోలేకపోవడం సిగ్గుచేటు.

Wednesday, January 30, 2008

మోహన్ బాబు -- ఆవు

మిత్రుడొకరు మోహన్ బాబు మీద పోస్ట్ చదివి "ఆవుమీద వ్యాసం" అంటే ఏమిటండీ అని ఫోన్ చేశారు. ఆయనకి వివరం చెప్పాను.స్కూలుపిల్లాడొకడు పరీక్షకెళ్తూ ఒకేఒక్క వ్యాసం చదువుకుని వెళ్ళాడట.అది ఆవు గురించి.తీరా పరీక్షలో విమానం మీద,రైలు మీదా వ్యాసం రాయమని అడిగారట. మనవాడికి ఆవు ఒక్కటే తెలుసు.ఇక వ్యాసపరంపర ఇలా సాగింది."విమానం గాలిలొ ఎగురుతుంది.దానికి రెక్కలుంటాయి.పైకి ఎగిరాక కిందకి చూస్తే పచ్చిక బయళ్ళు కనబడ్తాయి. అక్కడ గడ్డిమేస్తూ ఆవులుంటాయి. ఆవు సాధుజంతువు. దానికి రెండు కొమ్ములుంటాయి.నాలుగు కాళ్ళుంటాయి.ఆవు పాలిస్తుంది. పేడ వేస్తుంది...." ఇలా మొత్తం ఆవుగురించే రాసేశాడు.

ఇక రైలు గురించి మొదలెట్టి " రైలు పట్టాల మీద నడుస్తుంది.దాని ఇంజన్ వెనక పెట్టెలుంటాయి. అందులో ఎక్కి వెళ్తుంటే పట్టాల పక్కన గడ్డిమేస్తూ ఆవులుంటాయి. ఆవు సాధుజంతువు. దానికి రెండు కొమ్ములుంటాయి.నాలుగు కాళ్ళుంటాయి.ఆవు పాలిస్తుంది. పేడ వేస్తుంది...." మళ్ళీ ఇదే సోది..ఎందుకంటే వాడికొచ్చింది అదొక్కటే గనుక. ఈవిధంగా తిరిగి తిరిగి మొదటికే వచ్చే జీడిపాకాన్ని "ఆవుమీద వ్యాసం" అని చిన్నప్పుడు నవ్వుకునేవాళ్ళం.

ఇలా "ఆవుమీద వ్యాసం" మేధావుల వర్గంలో ప్రసిద్ధులయిన సినిమా వ్యక్తులు దాసరి నారాయణ రావు, ఆయన శిష్యుడు మోహన్ బాబు.

మోహన్ బాబు తీరు ఎలా ఉంటుందంటే....ఈ కింది ప్రస్తావనలు తప్పనిసరిగా ఉంటాయి.

1. అన్నయ్య (NTR)
2. మా గురువుగారు దాసరి
3. మా విష్ణు బాబు, మా మనోజ్ బాబు
4. మా పాప లక్ష్మీప్రసన్న
5. విద్యానికేతన్ కాలేజ్
6. ప్రజలే దేవుళ్ళు.
7. బాబా ఆశీస్సులు

ఒక కాలేజ్ వార్షికోత్సవంలో ఇలా ఉంటుంది ఆయన "ఆవుమీద వ్యాసం"

"ఈ కాలేజ్ పిల్లల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అన్నయ్యతో కలిసి 1995లో మేజర్ చంద్రకాంత్ షూటింగ్ సందర్భంగా ఫలానా కాలేజ్ కి వెళ్ళిన సంఘటన గుర్తొస్తున్నది. ఆ రోజే మా గురువుగారు దాసరిగారు కూడా ఇంకో ఫలనా కాలేజ్ లో షూటింగ్ కి వెళ్ళారు.మా విష్ణుబాబుని కూడా ఇదే కాలేజ్ లో చేర్పించి IPS చేయించాలి అనుకున్నాను. కానీ అభిమానుల (?) కోరికమేరకు సినిమాల్లోకి తెచ్చాను.మరి పాప లక్ష్మీప్రసన్న కూడా అమెరికాలో ఫలానా కోర్సు చేసింది.ఈ కాలేజ్ కూడా అచ్చం మా విద్యానికేతన్ కాలేజ్ లా ఉంది.అక్కడ 2 వేలమందికి చదువు చెబ్తున్నాం. అడ్మిషన్ ఫాంలో కులం పేరు అడగని ఏకైక కాలేజ్ మాదే. మరి దీన్ని లెజెండ్ అనరా ? ప్రజలే దేవుళ్ళు.వాళ్ళు చూస్తున్నారు.బాబా ఆశీస్సులు నాకు,నా కుటుంబానికి కావాలి. ఇక్కడున్న పిల్లలంతా నాలాగే మంచివాళ్ళు. మేము ఎవరికీ హాని చేసేవాళ్ళం కాదు. ఒకరిగురించి చెడుగా తలిచేవాళ్ళం కాదు... "

ఇంతవరకు ఏ తానా సభలకిగాని,ఆటా సభలకిగానీ ఆహ్వానం అందినట్లు లేదుగానీ, ఒకవేళ వస్తే గిస్తే ఆయన "ఆవుమీద వ్యాసం" ఇలా ఉంటుంది....

"ఇంతమంది ప్రవాసాంధ్రుల్ని చూస్తుంటే అన్నయ్య చెప్పినట్లుగా చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనాలనిపిస్తుంది. మా గురువు దాసరి గారు ఇదేమాట అన్నారు. మీరంతా నాలాగే క్రమశిక్షణతో కష్టపడి పైకొచ్చినవాళ్ళు. మనం ఎవరికీ హాని చేసేవాళ్ళం కాదు. ఒకరిగురించి చెడుగా తలిచేవాళ్ళం కాదు.అసలు మా మనోజ్ బాబు అమెరికా వెళ్ళి IPS అవుతా నాన్నా అని అడిగాడు.కానీ, మళ్ళీ అభిమానుల వత్తిడికి తలొంచి సినీకళామతల్లికి నా జంటసింహాలను అంకితం చేశాను.మరి దీన్ని లెజెండ్ అనరా ? ఇక్కడ ఉన్న కొందరు NRIలు నన్ను అడిగారు. వాళ్ళ పిల్లలకి క్రమశిక్షణ నేర్పమని. మీ పిల్లల్ని హార్వర్డ్,స్టాన్ ఫర్డ్ లాంటి చోట్లకి కాకుండా మా విద్యానికేతన్ కి పంపండి అని చెప్పాను.ఏది ఏమయినా బాబా ఆశీస్సులు నాకు,నా కుటుంబానికి కావాలి......."

ఇదీ ఆయన వరస !

అది పరామర్శ అయినా, సంతాపం అయినా, వివాహం అయినా, రమ్యక్రిష్ణతో ఇంటర్వ్యూ అయినా..అన్నిటికీ మోహన్ బాబు గారిది ఒకటే మంత్రం !

ఇలా "ఆవుమీద వ్యాసం" మేధావుల వర్గంలో ఇద్దరు రాజకీయులు కూడా ఉన్నారు. ఎవరో ఊహించండి. వారిగురించి తదుపరి పోస్ట్ లో రాస్తా.

Monday, January 28, 2008

మారెప్పని కొడ్తారా ఇప్పుడు ?

సందట్లో సడేమియా-పార్ట్ 2 మొదలయింది. ఈసారి మాటలు విసిరింది మంత్రి మారెప్ప. ఇందుగలడందులేడను సందేహం లేకుండా అన్ని టాపిక్స్ మీదా అనర్గళంగా కామెంట్లు విసురుతున్న మంత్రిగారు పవన్ కళ్యాణ్ రివాల్వర్ తిప్పుడు,మొదటిభార్యతో విడాకుల అంశం మీద తన సహజశైలిలో మాట్లాడారు.

ఇప్పుడు రిజిష్టర్డ్ మరియు అన్-రిజిష్టర్డ్ ఫాన్స్ ఎలా "మనస్తాపం" చెందుతారో చూడాలి :-)

మారెప్ప మాత్రం రాజశేఖర్ కాదు.ఇంకో బలమయిన రాజశేఖర్ అండదండలతో, ఆశీస్సులతో రోజుకోరకంగా విజృంభిసున్నవాడు ! పైగా దళితవర్గానికి చెందిన మంత్రి ! ఆంధ్రప్రదేశ్ లో ఏ సందుకయినా సిధ్ధమే అని ఇంద్ర సినిమా డైలాగుల్లాగా సవాళ్ళు విసురుతున్నాడు అసలే !

మోహన్ బాబు సందట్లో సడేమియా

సినీనటుడు రాజశేఖర్ చిరంజీవికి రాజకీయానుభవం లేదని భీమవరంలో వ్యాఖ్యలు చేశారట. దానికి కోపగించి చిరు అభిమానులుగా చెప్పుకున్న కొందరు, పిల్లలతో వెళ్తున్న రాజశేఖర్ కుటుంబం పైన దాడి చేసి (పిల్లల్ని) గాయపరిచిన విషయం ఈ రోజు వేడి వార్త.

మీలో ఈ వార్త ఇంకా ఎవరికయినా తెలియకపోతే మెరుగయిన సమాజం కోసం రోజుకి 25 గంటలు తపించే ఒక ఛానెల్ని సంప్రదించండి.

రాజశేఖర్ గారివి వ్యక్తిగత వ్యాఖ్యలు.తన అభిప్రాయాన్ని వెలిబుచ్చే హక్కు ఆయనకుంది. అభిప్రాయాల్ని వెలిబుచ్చినందుకు ఆయన మీద, పసిపిల్లల మీద దాడి చేయడం అమానుషం.ఖండించాల్సిన అంశం.అదే సమయంలో రాజశేఖర్ కూడా ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. అసలు చిరంజీవిగారు తనంతట తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు ఇంతవరకూ. ఆయన చెప్పకుండానే, వస్తాడో రాడో తెలియకుండానే, మనకి అభిప్రాయం వెలిబుచ్చే హక్కు ఉంది గదా అని, ఆయనకి రాజకీయానుభవం లేదని కామెంట్ చేసి వివాదాన్ని కొనితెచ్చుకోడం ఎందుకు ?
దాడి జరిగిందని తెలిసి చిరంజీవి రాజశేఖర్ ఇంటికెళ్ళి పరామర్శించి, క్షమాపణలు తెలియజేయడం చాల సంస్కారవంతంగా ఉంది.

కానీ ఆయన ఆ ప్రెస్ మీట్లో కొన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సంఘటనని బహిరంగంగా ఖండించదల్చుకుంటే ఆ పని ఎలాంటి శషభిషలు లేకుండా చేయాలి. "అభిమానులు మనస్తాపం చెంది ఉంటారు...హర్ట్ అయి ఉంటారు. కానీ వాళ్ళ ఆవేశం కంట్రోల్ చేసుకోవాలి".. ఏమిటీ సోది ?

రాజకీయాల్లోకి రావడానికి,అధికారం అందుకోడానికి రాజకీయానుభవం అనేది ప్రాతిపదిక కాదు.ఎన్.టి.రామారావ్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ విమర్శ వచ్చింది. దానికి సమాధానం జనమే తేల్చి చెప్పారు.ఎన్టీయార్ కయినా,రాజీవుడికయినా, సోనియాకయినా, చిరంజీవికయినా ఆ విమర్శ అక్షరాలా వర్తిస్తుంది. దానికి దురభిమానులు ఆవేశపడాల్సింది ఏంలేదు.రాజశేఖర్ మాట్లాడింది సత్యమే అంటూనే, దానికి అభిమనులు మనస్తాపం చెంది ఉంటారు అని ఈయనే చెప్పడం ఏంటి ? ఇప్పటిదాకా ఇదెవరో దురభిమానులు చేసింది అని అనుకుని ఖండించవచ్చు. చిరంజీవి ఇలా చెబ్తే, ఓహో మేము కూడా మనస్తాపం చెందాలి కాబోలు అని మామూలు అభిమానులు కూడా ఆవేశపడే ప్రమాదం ఉంది.రేపొద్దున్న ఇంకెవరన్నా ఏదన్నా అంటే మళ్ళీ ఇదే డ్రామా మొదలు.

నాగబాబు వచ్చి వాళ్ళు రిజిష్టర్డ్ ఫాన్స్ కాదు...అన్-రిజిష్టర్డ్ ఫాన్స్ అంటాడు. అదేదో కావాలని ఎవరో చేసినట్లుగా . దుండగులో, చిరంజీవికి చెడ్డపేరు తెచ్చే కుట్రో అయితే ముసుగులు వేస్కుని ఆ పని చేసేవాళ్ళు. ఇలా బహిరంగంగా, తమ కూడా వీడియో కెమెరాలు తెచ్చుకుని, దాడిని చిత్రీకరించి, మళ్ళీ ఆ క్యాసెట్ ని టివి ఛానెల్స్ కి పంపి ఉండేవాళ్ళు కాదు.

ఇహ వెంటనే పరామర్శల పర్వం మొదలయింది. ఆ సందట్లో అసలయిన సడేమియా మోహన్ బాబు గారిది. ఆయన గురువుగారికిమల్లే (దాసరి)ఈయన సగం శ్లేషతో,సగం వ్యంగ్యంతో, సగం మన కాల్పనిక,ఊహాశక్తికి వదిలేస్తూ మాట్లాడ్డం ! రాజశేఖర్ కూడా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబిలీ సినిమాలు తీశాడు అంటాడు. ఇక్కడెవరూ పిరికివాళ్ళు లేరు, అసమర్ధులు లేరు అంటాడు. అసలు దానిగురించి ఇప్పుడెందుకు ? ఎవర్ని రెచ్చగొడ్తున్నాడో అర్ధం కాదు. ఎవరు చేయించారో ప్రజలకే తెలుసు అంటాడు. చిరంజీవి చేయించాడేమో అన్న అర్ధం రావాలనేమో ! ఇక అసలు పరామర్శకి వచ్చాను అనే విషయం వదిలేసి ఆయన మంచితనం గురించి,ఆయన కుటుంబం గురించి స్వోత్కర్ష ! రాజశేఖర్తో కలిపేసుకుని నేను చాలా మంచోడ్ని అని సొంతడబ్బా..ఏ సంఘటన జరిగినా, ఏ సందర్భంలో అయినా ఆవు మీద వ్యాసం రాసినట్లుగా మాట్లాడగల సమర్ధుడు మోహన్ బాబు !

ఈ కామెడీ ఇంకా కొనసాగబోతోంది! వేచి చూడండి !

Saturday, January 26, 2008

పాడిగేదెలు..దున్నపోతులు

వైయెస్ రాష్ట్రానికి లభించిన పాడిగేదె అని జె.సి.దివాకర్ రెడ్డి గారు మొన్నెప్పుడో ఒకానొక సభలో సెలవిచ్చారట. తర్వాత నాలిక్కరుచుకుని ఆయన కవిహృదయం ఏమిటో వివరించారటలెండి ! పనిలోపనిగా చంద్రబాబుని మాత్రం వదిలేయడం ఎందుకని ఆయన దున్నపోతులాంటివాడు అని కూడా వాక్రుచ్చారుట. సరే దివాకరుని మనసులోని మర్మం మనకి అర్ధమయిందనుకోండి..అది వేరే సంగతి.

అయ్యా దివాకర్ గారూ !ఇంతకీ మిమ్మల్ని మీరు (నాయకులు) ఏమనుకుంటున్నారు అన్నది కాదు విషయం ! జనం ఏమనుకుంటున్నారు మిమ్మల్ని అనేదే సరయిన కామెడీ. మీ నాయకుల్ని ఏ జాతిలోనూ సరిగ్గా ఇరికించలేం అని మా అభిప్రాయం. అసలు మీ నాయకులది సెపరేట్ జాతి సార్ !

మీరు అధికారంలో ఉంటే మీ మనుషులకి పాడిగేదెలు,పదవిలోంచి దిగిపోతే మీవారికి దున్నపోతులు అని జనానికి తెలుసు. అలాగే మంత్రిపదవి వచ్చిందా, రాబోతుందా అనేదాన్నిబట్టి మీరు అకశేరుకాలు లేదా సకశేరుకాలు అవుతారు అని తెలుసు మాకు.

జనాలు గొర్రెలు అయినప్పుడు మీరు పులులు. మీ నియోజకవర్గాల్లో మీరంతా మొసళ్ళు. బయటికి అడుగేస్తే ఒడ్డునపడ్డ చేపలు. కప్పుకున్న కండువా రంగునిబట్టి ఊసరవెల్లులు.ఎక్కిన గోడనిబట్టి పిల్లులు.పాడిగేదె అధినాయకుడు దొరికితే విశ్వాసంగల కుక్కలు.కథ అడ్డం తిరిగితే ఆయన్నే పడగొట్టడంలో నక్కలు ! "మేత" వెతకడంలో డేగలు! "మేతసైజు" విషయంలో ఏనుగులు ! అసలు పని మానేసి చట్టసభల్లో అల్లరి చేయడంలో కోతులు !ఎన్నికలొస్తే గల్లీల్లో వాగ్దానాల చిలుకలు ! స్కాములు బయటపడి విచారణలు చేయాల్సి వచ్చినప్పుడు మీరూ మీరూ కలిసిపోడంలో కాకులు. సమస్యల్ని,సంపాదనని వేరుచేయడంలో హంసలు !

మీ ఆంబోతుల మధ్య అమాయకపు జనాలు లేగదూడలు !

Wednesday, January 23, 2008

కొత్తసంవత్సరపు తెలుగువెన్నెల


మందపాటి సత్యంగారు అతిధిగా విచ్చేసిన కొత్తసంవత్సరపు తెలుగువెన్నెల సమావేశం చక్కగా జరిగింది. చాలామంది డల్లాస్ మిత్రులకి ఆయనతో వ్యక్తిగత పరిచయం వల్ల,సమావేశం గుడిలో అవ్వడంవల్ల అనుకుంటా, వెన్నెల సమావేశం ఈసారి చిక్కబడింది.ఇంతమంది మిత్రులు హాజరవ్వడం శుభసూచిక.డా ఆళ్ళ శ్రీనివాసుడు సరాసరి ఎయిర్ పోర్ట్ నుండే వచ్చేశారులా ఉంది.ఆశుకవి డా తారాకుమార్, సాహిత్యాభిమాని డా బోయ సుబ్రమణ్యం,సుభాషిణి గార్లు మొదటిసారి వెన్నెల సమావేశానికి రావడం సంతోషదాయకం. వరసగా రెండో నెల ప్రసాద్ తోటకూర గారు లేని లోటు కనబడింది.


ఇహ సమావేశం వివరాలకొస్తే, ప్రొఫెసర్ బండ్ల రాగయ్య గారు పద్యాలతో వీనులవిందు చేశారు.ఎప్పుడో చిన్నప్పుడు విన్న వాణిముత్యాల్ని రాగయుక్తంగా మళ్ళీ వినిపించారు.జువ్వాది రమణ, నందివాడ ఉదయభాస్కర్ గార్లు పోటాపొటీగా నవ్వించారు తమ పేరడీ పాటలతో.సత్యం గారిని సభకి సరిగ్గానే పరిచయం చేశాననుకుంటున్నా. ఎన్నారై కబుర్లగురించి,తన రచనావ్యాసంగం గురించి మందపాటి గారు సాహిత్యవేదిక మిత్రులతో బాగా పంచుకున్నారు.భాష పరిణామక్రమం గురించి మందపాటి, తారాకుమార్,జాగ్స్ గారి వ్యాఖ్యలు కొత్త విషయాల్ని తెలియజేశాయి.తెలుగుపీపుల్.కాం కి చెందిన ప్రసాద్ కూనిసెట్టి గారిని సభకి పరిచయం చేసినందుకు యలమంచిలి రామచంద్రరావ్ గారికి ధన్యవాదాలు.


మొత్తానికి అన్నింటిలోకి గమ్మత్తు ఏంటంటే 40 మందికి ఆర్డరు చేసిన పకోడీల్ని మిత్రుడు గోపి వెళ్ళి పట్టుకొస్తే అవి తీరా ఇరవయిమందికి కూడా సరిపోనంత పరిమాణంలో ఉండటం. కానీ, మురళి,గోపి,నేను మా "హస్తలాఘవం" (వేరే అర్ధాలు వెతక్కండి) ప్రదర్శించి సరిపెట్టేశాం. సరిపెట్టుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు.

Monday, January 21, 2008

ముహుర్తం బాగుంది

ఇప్పుడే మిత్రులతో కలిసి "ముహుర్తం" సినిమా ప్రివ్యూ చూసొచ్చాను.డల్లాస్ నగరంలో ప్రముఖ వైద్యులయిన డా కృష్ణబాబు చుండూరిగారి అమ్మాయి కృష్ణస్మిత ఈ సినిమాలో కథానాయికగా నటించింది.అమెరికాలో పుట్టి పెరిగిన స్మిత నటన పట్ల మక్కువతో,నటనలో కోర్సునభ్యసించి, దాదాపు సంవత్సరం పైగా పట్టుదలతో దీక్షగా గ్రామీణ వాతావరణంలోనే ఉంటూ ఈ సినిమాలో నటించింది.

1947 ముందు కథాంశంతో,స్వాతంత్ర్యోద్యమ నేపధ్యంలో తీసిన ప్రేమకథా చిత్రం ఇది.స్వాతంత్ర్య సముపార్జనలో నాయకుల త్యాగాలే కాకుండా ఎందరో సామాన్యులు చేసిన త్యాగాలు మరుగునపడ్డాయనే అంశాన్ని,ఒక యువజంట ప్రేమకథ రూపంలో ఎంతో అందంగా తెరకెక్కించారు.

ఫ్యాక్షన్, యాక్షన్, పగలు, రక్తపాతాలు చూసి విసుగెత్తిన ప్రేక్షకులకు ఈ సినిమా కొంత రిలీఫ్ గా ఉంటుంది. ఎటువంటి అసభ్యత,అశ్లీలత, కుప్పిగంతులు, హింసాత్మక పోరాటాలు లేకుండా, చక్కటి గ్రామీణ నేపధ్యంలో చిత్రీకరించారు. నటీనటులంతా కొత్తవాళ్ళే అయినప్పటికీ, భేషయిన నటన ప్రదర్శించారు.పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి.

బహుశా పీరియాడిక్ చిత్రం అనే ఎఫెక్ట్ రావడంకోసం అనుకుంటా చిత్రమంతా ఒక రకమయిన tinge వాడారు.కొన్ని సన్నివేశాల్లో,కెమెరా లైటింగ్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది.తాము చూస్తున్నది బ్రిటిష్ కాలం నాటి కథాంశం అని ప్రేక్షకుల మనస్సుల్లో ముద్ర వేసేలా,సినిమాలో బ్రిటిష్ పాలన నేపధ్యాన్ని ఇంకొంచెం బలంగా "పలికించి" ఉంటే బాగుండేదేమో.నటిగా కృష్ణ స్మిత,దర్శకుడిగా రవి తెనాలి నిస్సందేహంగా తమ మొదటి సినిమాలొనే తమ ప్రతిభతో మనల్ని ఆకట్టుకుంటారు.

Thursday, January 17, 2008

ఆరవ తెలుగువెన్నెల ప్రకటన

కొత్త సంవత్సరంలో మొదటి తెలుగువెన్నెల జనవరి 20వ తేదీ ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలనుండి DFW హిందూ దేవాలయంలో జరగబోతున్నది. ప్రముఖ రచయిత మందపాటి సత్యంగారు విశిష్ట అతిధిగా విచ్చేస్తున్నారు. డల్లాస్ సాహితీమిత్రులంతా పాల్గొనవల్సిందిగా మనవి.

Monday, January 14, 2008

తెలుగువన్ రేడియోలో హరివిల్లు

తెలుగువన్.కాం చాలామందికి పరిచితమే అనుకుంటా. వర్జీనియాలోని George Mason University లో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసరయిన వెనిగళ్ళ మోహన్,ప్రముఖ కార్టూనిస్ట్ మల్లిక్ ల సారధ్యంలో తెలుగువన్ వారు 24/7 ఉచిత ఇంటర్నెట్ రేడియో (TORI-telugu one radio on internet) ని ప్రసారం చేస్తున్నారు. తెలుగు కార్యక్రమాలు, సినిమా పాటలు, తెలుగు వార్తలు మొదలయినవి తెలుగు రేడియోలో వినాలనుకునే ప్రవాసాంధ్రులకి ఇదొక చక్కటి సాధనం.

ఈ రేడియోలో ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటలకి "హరివిల్లు" అనే పేరుతో నేనొక కార్యక్రమాన్ని గత రెండువారాలనుండి నిర్వహిస్తున్నా. మొన్నటి శనివారం ప్రముఖ గాయకుడు జేసుదాస్ మీద ఒక కార్యక్రమం చేశా. ఆయన పాడిన మంచి పాటలు చాలా ఉన్నాయి కనుక మహిళల్నిగురించిన ప్రస్తావన ఉన్న పాటల్ని ఎంచుకుని వాటిగురించి వ్యాఖ్యానిస్తూ, ఆ పాటల్ని వినిపిస్తూ కార్యక్రమం చేశాను. అంతకు మునుపు శనివారం మహాకవి శ్రీశ్రీ రాసిన తెలుగు సినిమా పాటలమీద కార్యక్రమం రూపొందించాను.

ఈ రేడియో http://www.teluguoneradio.com/ లో వినవచ్చు. ఈ లింకులో మీకు 4 ఛానెల్స్ ఉంటాయి.ఇండియా,US East Coast, US West Coast, UK ఛానెల్స్ ఉంటాయి.ప్రతి చానెల్లోనూ "స్థానిక సమయం" ప్రకారం కార్యక్రమాలు ప్రసారం అవుతుంటాయి.


ఉదాహరణకి "హరివిల్లు" కార్యక్రమం ప్రతిశనివారం మధ్యాహ్నం 12 గంటలకి. మీరు ఇండియాలో ఉంటే,ఇండియా ఛానెల్లో మీ మధ్యాహ్నం 12కు హరివిల్లు ప్రసారం అవుతుంది (అప్పటికి ఇంకా అమెరికాలో శుక్రవారం రాత్రి నడుస్తుంటుంది).అదే మీరు eastcoast లో ఉంటే మీ మధ్యాహ్నం 12కి మీరు EST ఛానెల్ క్లిక్ చేసి హరివిల్లు వినవచ్చు.సెంట్రల్టైం జోన్ వాళ్ళు EST లింకుద్వారా ఉదయం 11కి వినవచ్చు. ఆ టైంకి కుదరకపోతే pacific ఛానెల్ ద్వారా మధ్యాహ్నం 2కి వినవచ్చు.


తికమకగా ఉందా ? ఏం లేదు..మీరు ఒకే కార్యక్రమాన్ని 4 ఛానెల్స్ లో నాలుగుసార్లలో ఎప్పుడయినా వినవచ్చు.కాకపోతే ఆ ఛానెల్ local time కి అనుగుణంగా కార్యక్రమాలు ప్రసారం అవుతాయి.

"హరివిల్లు" కార్యక్రమం తిరిగి సోమవారం రాత్రి 8 గంటలకి, బుధవారం మధ్యాహ్నం 12కి పునఃప్రసారం అవుతుంది.

ఈ కార్యక్రమం విని మీ అభిప్రాయాల్ని,సూచనలని, విమర్శల్ని నాకు tori.harivillu@gmail.com కు ఈ-మెయిలు ద్వారా తెలియజేయండి.

Radio link : http://www.teluguoneradio.com/

మల్లాదితో ఒక సాయంత్రం

మొన్నటి శనివారం సాయంత్రం పసంద్ రెస్టారెంట్లో డల్లాస్ తెలుగు సాహితీప్రియులంతా ప్రముఖ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తితో కలిసి 3 గంటలపాటు ముచ్చటించడం జరిగింది. ప్రముఖ వైద్యులు,సాహితీప్రియులయిన ఆళ్ళ శ్రీనివాస రెడ్డిగారు ఏర్పాటు చేసిన ఈ విందులో డల్లాస్ తెలుగు సాహిత్య వేదిక సభ్యులయిన సాహిత్యాభిమానులు చాలమంది కుటుంబసమేతంగా పాల్గొన్నారు. ఎక్కువ వ్యవధి లేకుండానే విందు నిర్ణయం జరిగినప్పటికీ చంద్రగారు, ఎంవీయెల్ ప్రసాద్ గారు చకచకా ఫోన్లు కలిపి అందరికీ వార్త చేరవేయడం, మిత్రులంతా మల్లాదిగారితో ముచ్చటించడానికి రావడం జరిగింది.

సతీసమేతంగా విందులో పాల్గొన్న మల్లాదిగారు తన నవలల్లో తనకు నచ్చినవి,ఇతరుల నవలల్లో తనకు నచ్చినవి, అవి నచ్చడానికిగల కారణాలు వంటి అంశాలపైన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కొద్దిసేపు సంభాషణ ఆయన రాసిన చందమామ కథలవేపుకి మళ్ళింది. చందమామ కథలు అనగానే మిత్రులు చాలామంది తమ బాల్యజ్ఞాపకాల్లో కొద్దిసేపు విహరించారనుకుంటా. TV కార్యక్రమాలపట్ల మొహం మొత్తిన తెలుగుప్రజలు మళ్ళీ పుస్తకం బాట పడ్తున్నట్లుగా ఈ మధ్య కనిపిస్తుంది అని ఆయన చెబుతుంటే సంతోషంగా అనిపించింది.తెలుగు వాడకం,నవలలు,ఇతర తెలుగు పుస్తకాలు చదవడం ఎందుకు తగ్గిపోతున్నది,సమస్య పరిష్కారానికి ఏం చేయాలి అనే అంశం కూడా బాగానే చర్చించబడింది.

మల్లాదిగారికి ఒక చిన్న పట్టింపు ఉంది.ఆయన ఫోటో ని ఇంతవరకు ఎక్కడా ప్రచురించలేదు. అదాయనకు ఇష్టం ఉండదు. దానివల్ల కొంత స్వేచ్చని కోల్పోవలసివస్తుంది అని ఆయన అభిప్రాయం. సమకాలీన ప్రముఖరచయితల్లో "ఎలా ఉంటారో" తెలియని అతికొద్దిమందిలో ఆయనొకడు.ఇప్పటిదాకా చాలాసార్లు ఆయన పుస్తకాలు చదివి ఆందించాం.ఇప్పుడు ఆయన్ని కలుసుకుని సరదాగ పిచ్చాపాటీ మాట్లాడుకుని చక్కటి విందుభోజనం చేశాం.ఆళ్ళ శ్రీనివాసుడికి మా అందరితరపునా ధన్యవాదాలు.

Wednesday, January 9, 2008

భారతరత్న ఎన్టీఆర్

వాజపేయి గారికి భారతరత్న పురస్కారం ప్రకటించవలసిందిగా అద్వానీగారు ప్రభుత్వానికో లేఖ రాశారంట.నిస్సందేహంగా ఆ పురస్కారానికి ఆయన అర్హుడని చాలమంది అభిప్రాయం. సందర్భం వచ్చింది కనుక, అన్నగారికి అదే పురస్కారం ఇంకా ఎందుకు ప్రకటించలేదనే ప్రశ్న నాలాంటి అభిమానుల్ని తొలిచివేస్తున్నది.

చంద్రబాబు కేంద్రరాజకీయాల్లో "చక్రం" తిప్పినన్ని రోజులూ అన్నగారికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించనివ్వలేదంటారు.నిజంగా ఆయన తల్చుకుంటే ఆ రోజుల్లో అది నిమిషాల్లో జరిగే పని. కానీ భారతరత్నగా అన్నగార్ని ప్రకటిస్తే, గణతంత్రదినోత్సవంలో ఆ పురస్కారాన్ని ఎన్టీఆర్ వితంతువు హోదాలో లక్ష్మీపార్వతి అందుకోడం చంద్రబాబుకి ఇష్టం లేదని, అందుకే ఆ ప్రతిపాదనకి ఆయన మోకాలడ్డాడని ఆయన మనసు తెలిసినవారు గుసగుసలాడుకుంటారు.బహుశా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా అందుకే ఎక్కువ వత్తిడి చేయలేదంటారు.

ఎన్టీఆర్ గారి అమ్మాయి పురంధ్రేశ్వరి ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు.ఆవిడ కృషి చేసి అన్నగారికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటింపజేయాలని అభిమానుల కోరిక. అందులోనూ మొన్నీమధ్యే ఆవిడ ఎన్టీఆర్ సరికొత్త వారసుడిగా వైయెస్ ని ప్రకటించి ఉన్నారు గనుక కాంగీయులకి కూడా పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు.

ఈ జనవరి 18కి అన్నగారు అమరులయ్యి పుష్కరకాలం పూర్తవుతుంది. బతికి ఉన్నప్పటికంటే ఎక్కువగా చంద్రబాబు తెదేపా వారు అన్నగార్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. ప్రజలకి గుర్తు చేస్తున్నారు. విచిత్రంగా కాంగీయులు కూడా అన్నగారి పధకాలని పొగిడేస్తూ అవే అమలు చేస్తాం అంటున్నారు. ఇహ చిరంజీవి రాజకీయరంగ ప్రవేశవార్తల వల్ల కూడా అన్నగారిని తరచుగా ప్రస్తావిస్తున్నారు. పనిలో పనిగా మాయావతి వ్యాఖ్యల్ని ఖండించడానికి కూడా. ఇంతగా అన్నగార్ని గుర్తు చేసుకుంటున్న వీళ్ళంతా కనీసం అద్వానీలాగా ఒక ప్రకటన అయినా పడేస్తే బాగుంటుందేమో!