Monday, December 24, 2007

నిస్సంస్కృతీకరణ (de-sanskritization)

నిన్న రాత్రి చంద్ర కన్నెగంటిగారితో మాట్లాడుతున్న సందర్భంలో వచ్చిన ఒక ప్రస్తావన, ఈ రోజు ఆంధ్రజ్యోతిలో చూసిన ఒక వార్త ఈ పోస్ట్ రాయడానికి పురిగొల్పాయి.

ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త ఎం.ఎన్.శ్రీనివాసన్ సంస్కృతీకరణ (sanskritization) అనే పదాన్ని బాగా వ్యాప్తిలోకి తెచ్చారు.(Ref: Caste in Modern India and other Essays by M.N.Srinivasn). భారతదేశ కులవ్యవస్థని విశ్లేషిస్తూ ఆయన చాలా రచనలు చేశారు.

కులవ్యవస్థలో కింది మెట్ల మీద ఉన్న కులాలు తమ కులానికి "గౌరవం","ప్రామాణికత" ఆపాదించుకోడం కోసం కొన్ని బ్రాహ్మణ ఆచారాలు, కట్టుబాట్లు,పధ్ధతులు,పూజా విధానాలు పాటిస్తారని,ఆ విధంగా చేయడంవల్ల కులాలనిచ్చెనలో ఇంకో మెట్టు పైకి ఎదిగే అవకాశం ఉందనీ ఆయన అంటారు. శాకాహారం తినడం,పూజల్లో మాంసం నిషిధ్ధం చేయడం, బ్రాహ్మణ పూజార్లతో పూజలు చేయించడం(గ్రామదేవతల జాతర్లలో కూడా),పండగదినాల్లో మాంసం తినకపోడం (కొన్ని మినహాయింపులతో)..ఇవన్నీ కొన్ని ఉదాహరణలు. ఇంకా మంగలి కులం తమని "నాయీ బ్రాహ్మణులు" గా, కంసాలివాండ్రు తమని "విశ్వబ్రాహ్మణులు" గా సంభోధించుకోడం,జంధ్యం ధరించడం, చాకలి, మంగలి వంటి పురాతన తెలుగు పదాలకన్నా క్షురకుడు, రజకుడు వంటి సంస్కృత పదాలు గౌరవప్రదంగా భావించడం వంటివి మరికొన్ని ఉదాహరణలు. స్థూలంగా సంస్కృతీకరణ అర్ధం ఇది.తర్వాత రోజుల్లొ ఈ పదం పరిధి చాలా విశాలంగా,కులవ్యవస్థ చారిత్రక పరిణామక్రమం మదింపుకి కూడా అన్వయించబడిందనుకోండి.అలాగే ఈ భావన తాలూకు పరిమితుల గురించి కూడా చాలా పరిశోధన జరిగింది.జరుగుతూనే ఉంది.

ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే, 1962లో శ్రీనివాసన్ చూసిన, విశ్లేషించిన కులవ్యవస్థకి,45 సంవత్సరాల పరిణామక్రమంలో ఇప్పుడు వచ్చిన మార్పుకి ఉన్న తేడాని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ కులవ్యవస్థ దృష్ట్యా చూసినట్లయితే గత 15 సంవత్సరాల్లో ఇదే సంస్కృతీకరణ వ్యతిరేకదిశలో జరుగుతున్నట్లుగా కనబడ్తున్నది.అంటే కులాలనిచ్చెన మీద పై మెట్టులో ఉన్న కులాలు ఒక మెట్టు దిగి తమని "నిమ్నకులాలు" గా ప్రకటించమని ప్రభుత్వాల్ని కోరడం కనబడ్తున్నది. కాపులని బి.సి.కులాల జాబితాలో చేర్చమని విజ్ఞప్తి చేయడం,ప్రభుత్వం దాని అధ్యయానికి ఒక కమిషన్ నియమించడం ఒక ఉదాహరణ. రజకుల్ని ఎస్.సి జాబితాలో చేర్చమని విజ్ఞప్తి చేయడం ఇంకో ఉదాహరణ.

అయితే ఇక్కడొక చిన్న తిరకాసు ఉంది. కేవలం రిజర్వేషన్ వ్యవస్థ వల్ల వచ్చే లాభాలని పొందడానికి మాత్రమే ఈ కోరిక కోరుతున్నారా లేక నిజంగా సామాజిక హోదా పరంగా కూడా ఏ కులమయినా ఈ రోజు తమని తాము "నిమ్నకులం"గా భావిస్తున్నారా అనేది పెద్ద ప్రశ్న.

ఇక్కడ ఇంకో వైరుధ్యం కూడా ఉంది.నిమ్నకులస్తులు ఆర్ధిక అసమానతల వల్ల కోల్పోయే అవకాశాల్ని రిజర్వేషన్లద్వారా వారికి తిరిగి కల్పించి,సామాజికంగా వారి హోదాని,స్థాయిని పెంచడం రిజర్వేషన్ వ్యవస్థ పుట్టడానికి మూలకారణం. కానీ ఇప్పటికే సామాజికంగా కొంత మెరుగయిన స్థాయిలో ఉన్న కులాలు ఆర్ధికపరమయిన అవకాశాల్ని రిజర్వేషన్ల ద్వారా అందిపుచ్చుకోవాలనుకోడం కోసం ఒక మెట్టు దిగి తమని "నిమ్నకులాలు" గా ప్రకటించాలని కోరడం మన వ్యవస్థలో వచ్చిన ఒక వైచిత్రి.

అనుకున్న విధంగా కాకపోయినా,రిజర్వేషన్లు సామాజిక అంతరాల్ని ఇంకో విధంగా తొలగిస్తున్నట్లు కనబడ్తున్నది ! ఈ కోరికల వెనుక ఓటుబాంకు రాజకీయాలు ఉన్నాయనేది వేరే పార్శ్వం. కానీ ఈ పరిణామాలన్నీ నాకు మాత్రం నిస్సంస్కృతీకరణ (de-sanskritization) లాగా కూడా కనబడ్తున్నాయి. ఈ పదం ఉందో లేదో నాకు తెలియదు. శ్రీనివాసన్ బహుశా ఇదే పదం వాడి ఉండేవారేమో !

3 comments:

Anonymous said...

Mr KC Chekuri,

One of your friends has recommended me to take a look at your blog. I am delighted to read these posts which seem to have been written with a knowledge-enriched and broad perspective. Especially, the posts on politics and caste system make me feel that I am looking at a new and hitherto unseen angle of the contemporary issues. Good going. Keep it up.

Dr Seshu Kumar

rākeśvara said...

ofcourse reservation కోసమండీ ఈ ప్రయాసంతా... they could not care less about సంస్కృతి/తం (whatever that is)..
ఈ రోజుల్లో జరుగుతుంది ఆంగ్లీకరణ, రిజర్వేషను కాలేజీ అడ్మిషన్ల ద్వారా ఆంగ్లీకరణకు తోడ్పడుతుంది అంతే...
బ్రాహ్మలకో రాజులకో రిజర్వేషన్ ఇస్తే తీసుకోరా? చెప్పండి..
It all boils down to money!

అగంతకుడు said...

"అయితే ఇక్కడొక చిన్న తిరకాసు ఉంది. కేవలం రిజర్వేషన్ వ్యవస్థ వల్ల వచ్చే లాభాలని పొందడానికి మాత్రమే ఈ కోరిక కోరుతున్నారా లేక నిజంగా సామాజిక హోదా పరంగా కూడా ఏ కులమయినా ఈ రోజు తమని తాము "నిమ్నకులం"గా భావిస్తున్నారా అనేది పెద్ద ప్రశ్న."

ఇందులో పెద్ద ప్రశ్న ఏముందో నాకర్థం కాలేదు. మన దేశంలో కులాల ప్రాతిపదికన జరిగిన మోసం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు తమ నాలెడ్జ్ వేరొకరికి చెందకుండా బ్రాహ్మలు, ఇప్పుడు తమ రిజర్వేషన్ లు వేరొకరికి చెందకుండా మిగిలిన కులాలు చేసే ప్రయత్నాలు మన దేశ భవిష్యత్తుని నానాటికీ కృంగతీస్తున్నాయి. తెలుసుకునే వాల్లే లోపించారు. అంతే!
ఇది ఏనాటి సమస్యో! కొత్తగా బాధ పడాల్సిన అవసరం లేదు.