Saturday, January 26, 2008

పాడిగేదెలు..దున్నపోతులు

వైయెస్ రాష్ట్రానికి లభించిన పాడిగేదె అని జె.సి.దివాకర్ రెడ్డి గారు మొన్నెప్పుడో ఒకానొక సభలో సెలవిచ్చారట. తర్వాత నాలిక్కరుచుకుని ఆయన కవిహృదయం ఏమిటో వివరించారటలెండి ! పనిలోపనిగా చంద్రబాబుని మాత్రం వదిలేయడం ఎందుకని ఆయన దున్నపోతులాంటివాడు అని కూడా వాక్రుచ్చారుట. సరే దివాకరుని మనసులోని మర్మం మనకి అర్ధమయిందనుకోండి..అది వేరే సంగతి.

అయ్యా దివాకర్ గారూ !ఇంతకీ మిమ్మల్ని మీరు (నాయకులు) ఏమనుకుంటున్నారు అన్నది కాదు విషయం ! జనం ఏమనుకుంటున్నారు మిమ్మల్ని అనేదే సరయిన కామెడీ. మీ నాయకుల్ని ఏ జాతిలోనూ సరిగ్గా ఇరికించలేం అని మా అభిప్రాయం. అసలు మీ నాయకులది సెపరేట్ జాతి సార్ !

మీరు అధికారంలో ఉంటే మీ మనుషులకి పాడిగేదెలు,పదవిలోంచి దిగిపోతే మీవారికి దున్నపోతులు అని జనానికి తెలుసు. అలాగే మంత్రిపదవి వచ్చిందా, రాబోతుందా అనేదాన్నిబట్టి మీరు అకశేరుకాలు లేదా సకశేరుకాలు అవుతారు అని తెలుసు మాకు.

జనాలు గొర్రెలు అయినప్పుడు మీరు పులులు. మీ నియోజకవర్గాల్లో మీరంతా మొసళ్ళు. బయటికి అడుగేస్తే ఒడ్డునపడ్డ చేపలు. కప్పుకున్న కండువా రంగునిబట్టి ఊసరవెల్లులు.ఎక్కిన గోడనిబట్టి పిల్లులు.పాడిగేదె అధినాయకుడు దొరికితే విశ్వాసంగల కుక్కలు.కథ అడ్డం తిరిగితే ఆయన్నే పడగొట్టడంలో నక్కలు ! "మేత" వెతకడంలో డేగలు! "మేతసైజు" విషయంలో ఏనుగులు ! అసలు పని మానేసి చట్టసభల్లో అల్లరి చేయడంలో కోతులు !ఎన్నికలొస్తే గల్లీల్లో వాగ్దానాల చిలుకలు ! స్కాములు బయటపడి విచారణలు చేయాల్సి వచ్చినప్పుడు మీరూ మీరూ కలిసిపోడంలో కాకులు. సమస్యల్ని,సంపాదనని వేరుచేయడంలో హంసలు !

మీ ఆంబోతుల మధ్య అమాయకపు జనాలు లేగదూడలు !

7 comments:

చదువరి said...

శభాష్! చప్పట్లు!!

విశ్వనాధ్ said...

అయితే నాయకులకు ఒక ఎక్సట్రా కోలిఫికేసన్ కూడా ఉండని నాకర్దమయిపోయిందండోయ్.
అదేనండి, మన పాతసినిమాలల్లో ఎంటీవోడు, నాగేస్సర్రావు కామరూప ఇద్య అనే దాంతో ఎలా కావాలంతే అలా మారిపోతారుగా. అలాగన్నమాట

మాగంటి వంశీ మోహన్ said...

అదిరిందండీ టపా....అందుకోండి అభినందనలు...చివరి పేరా లోని పదాలు పచ్చి నిజం

Ramakrishna Bysani said...

nijam chepparu gurugaru...

రాధిక said...

వీళ్ళని వాళ్లతో పోల్చామని పాపం ఆ జంతువులు ఎంత బాధ పడుతుంటాయో.అద్భుతమయిన టపా.

కొత్త పాళీ said...

Bravo!!
Radhika's comment adds a new angle to the whole scenario.
ఆదిభట్ల నారాయణదాసు గారిని గురించి ఒక ఛలోక్తి ఉంది. ఒకసారి ఆయన బజారున వెళుతూ ఉంటే ప్రభువులు ఆనందగజపతి ఎదురయ్యారు. ప్రభువులవారు నర్మగర్భంగా "కవి వృషభులు ఎక్కడీకో బయల్దేరినట్లుందే" అన్నారుట. దాసుగారు చల్లగా .. "వృషభం ఎక్కడికెళ్తుందీ .. కామధేనువు దగ్గి్రికే!" అని చమత్కరించారు - ట.

కొత్త పాళీ said...
This comment has been removed by the author.